మా అమ్మాయిని సూటిపోటి మాటలతో చంపేశారు!

Tenth Student Commits Suicide in Palamaner - Sakshi

పలమనేరులో టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్య 

పాఠశాల మార్చారనే మనస్తాపంతోనే..! 

తల్లిదండ్రుల ఆందోళన 

24 గంటల్లో నిందితులను అరెస్ట్‌ చేస్తాం: పోలీసులు 

సాక్షి, పలమనేరు: పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం ఉద్రిక్తతకు దారితీసింది. సూటిపోటి మాటలు, వేరే పాఠశాలకు మార్చడాన్ని అవమానంగా భావించి తమ కుమార్తె ఉరేసుకుని తనువు చాలించిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి కథనం మేరకు.. పట్టణంలోని రాధాబంగ్లా ప్రాంతానికి చెందిన వజీర్‌ కూతురు నిజ్బా స్థానిక బ్రహ్మర్షి పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. టెన్త్‌ క్లాస్‌లో నిజ్బా, మరో బాలిక టాపర్లుగా పోటీపడి చదువుతున్నారు. పిల్లల మధ్య జరిగే చిన్నపాటి విషయాల కారణంగా తరచూ పాఠశాల బినామీ కరస్పాండెంట్‌ రమేష్‌  నిజ్బా తల్లిదండ్రులను చులకనగా మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో నిజ్బా అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు బడికి వెళ్లలేదు.

తిరిగి స్కూల్‌కు వెళ్లగా ఒకేక్లాస్‌లో ఇద్దరు విద్యార్థినుల మధ్య చదువులో పోటీ కారణంగా ఇబ్బందిగా ఉందని, పరీక్షలు ఇక్కడే రాసినా కొన్నాళ్లు వేరే స్కూల్‌కు పంపుదామని కరస్పాండెంట్‌ చెప్పినట్లు బాలిక తండ్రి వజీర్‌ తెలిపాడు. దీంతో రెండ్రోజుల నుంచి రంగబాబు సర్కిల్‌లోని ఆదర్శ స్కూల్‌కు నిజ్బా వెళ్తోంది. ఇలా ఉండగా మంగళవారం ముభావంగా ఉండడంతో పాఠశాల హెచ్‌ఎం తండ్రిని పిలిచి బాలికను ఇంటికి పంపించారు. ఇంటికొచ్చిన బాలిక తాను స్కూల్‌ యూనిఫామ్‌ మార్చుకుంటానని గదిలోకి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చింది. కిటికీలో నుంచి చూడగా మెడకు చున్నీ చుట్టుకుని వేలాడుతోంది. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బాలిక తల్లి నసీమా తన బిడ్డను సూటిపోటి మాటలతో చంపేశారయ్యా అంటూ కన్నీటి పర్యంతమైంది.  

పలమనేరులో ఉద్రిక్తత 
తమ కుమారై ఆత్మహత్యకు కారణమైన బ్రహ్మర్షి పాఠశాల కరస్పాండెంట్, టీచర్లను అరెస్టు చేసే దాకా బిడ్డకు అంత్యక్రియలను నిర్వహించమని మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేయడంతో పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు స్థానిక రంగబాబు సర్కిల్‌లో ఆందోళనలకు దిగారు. వీరికి బంధువులు, స్నేహితులు మద్దతు తెలిపారు. బిడ్డ మృతికి కారణమైన కరస్పాండెంట్‌ను, వేరే స్కూల్‌ విద్యార్థినిని తమ పాఠశాలలో మూడు రోజులు పెట్టుకున్న ఆదర్శ పాఠశాల హెచ్‌ఎంను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో పలమనేరు ఇన్‌చార్జ్‌ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి బాధితులతో మాట్లాడి పరారీలో ఉన్న నిందితులను 24 గంటల్లో అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించిన స్థానిక టీడీపీ నాయకులను ఆందోళనకారులు అడ్డగించడం గమనార్హం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top