తల్లిని కొట్టి చంపి.. కాసేపటికే రక్తపు మడుగులో పడి..

Telangana: Mother And Son Ends Life In Kamareddy District - Sakshi

అనుమానాస్పద స్థితిలో కొడుకు మృతి 

కామారెడ్డి జిల్లా భవానీపేటలో దారుణం

మాచారెడ్డి: ఇంట్లో గొడవ.. ఓ కొడుకు తల్లిని కర్రతో బాదడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.. గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మృతి చెందింది.. మృతదేహాన్ని తీసుకుని ఇంటికి తిరిగొచ్చేసరికి.. ఆ కొడుకు కూడా ఇంట్లో రక్తపు మడుగు మధ్య చనిపోయి ఉన్నాడు. శుక్రవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట గ్రామంలో కేవలం గంటన్నర వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. 

కుటుంబ కలహాలతో..: చిటుకుల నర్సమ్మ (67), ఆమె కుమారుడు నర్సారెడ్డి (45), ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి భవానీపేటలో ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా నర్సారెడ్డి భార్య పిల్లలను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదే గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. తల్లీకొడుకులు నర్సమ్మ, నర్సారెడ్డి సొంత ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల అయ్యప్పమాల వేసుకున్న నర్సారెడ్డి.. రెండు రోజుల క్రితమే శబరిమల యాత్రకు వెళ్లివచ్చాడు.

శుక్రవారం సాయంత్రం తన భార్యను ఇంటికి రప్పించాలంటూ తల్లితో నర్సారెడ్డి గొడవకు దిగాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. నర్సారెడ్డి ఆవేశంతో కర్రతో నర్సమ్మ తలపై బాదాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను గ్రామస్తులు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. దీంతో వారు నర్సమ్మ మృతదేహాన్ని భవానీపేటలోని ఇంటికి తీసుకువచ్చారు.

కానీ అప్పటికే ఇంట్లో రక్తం మడుగులో నర్సారెడ్డి మృతిచెంది కనిపించాడు. ఇది చూసి గ్రామస్తులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. కామారెడ్డి రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే నర్సారెడ్డి తలకు పెద్ద గాయమైనట్టు కనిపిస్తుండటం, రక్తపు మడుగు మధ్య పడి ఉండటంతో ఆయనను ఎవరో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top