రైతులపై టీడీపీ నేతల దాష్టీకం

TDP leaders attacked On Dalit farmers at Venkatachalam - Sakshi

నెల్లూరు జిల్లాలో దళిత రైతులపై దాడి 

అడ్డుకున్న సర్పంచ్‌పై దౌర్జన్యం 

వెంకటాచలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో తెలుగుదేశం నాయకులు శుక్రవారం దళిత రైతులపై దాడిచేశారు. అడ్డుకోబోయిన దళిత సర్పంచిపైనా దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ అనుమతులతో సర్వేపల్లి రిజర్వాయర్‌ నుంచి సారవంతమైన మట్టిని తమ పొలాలకు తోలుకుంటున్న దళిత రైతులపై టీడీపీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు దాడిచేశారు. రిజర్వాయర్‌లో అక్రమ మైనింగ్‌ ఎక్కడ జరిగిందో చూపాలన్న రైతులను కులం పేరుతో దూషించారు. టీడీపీ నాయకులు శుక్రవారం రిజర్వాయర్‌ వద్దకు వెళ్లి అక్రమ మైనింగ్‌ జరిగిందంటూ హంగామా చేశారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకున్నారు.

తమ పొలాలకు సారవంతమైన మట్టిని రిజర్వాయర్‌ నుంచి తోలుకునేందుకు ప్రభుత్వం అనుమతులిస్తే అడ్డుకోవడమేగాక, తప్పుడు ప్రచారాలు చేయడం ఏమిటని రైతులు వారిని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం, అధికారం కోల్పోయాక బ్లాక్‌ మెయిల్‌ చేయడం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. నాలుగుసార్లు ఓడిపోవడంతో సోమిరెడ్డి రైతులపై కక్షగట్టారన్నారు. దీంతో టీడీపీ నాయకులు ఒక్కసారిగా రైతులపై దాడికి దిగారు. ఈ దాడిలో దళిత రైతు మేకల నరసయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అడ్డుకోబోయిన దళిత సర్పంచ్‌ శీనమ్మపైనా దౌర్జన్యం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరికొందరు జోక్యం చేసుకుని సర్దుబాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది.  

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి  
మా పొలాలను బాగు చేసుకునేందుకు ప్రభుత్వ అనుమతులతో మట్టి తరలిస్తే అడ్డుకోవడమే కాకుండా ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారా? అని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతు నరసయ్యపై దాడి చేసి గాయపరచడమేగాక దళిత సర్పంచ్‌ శీనమ్మ, ఇతర రైతులపై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గాయపడిన నరసయ్యకు ప్రాథమిక చికిత్స చేయించి అక్కడే బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సోమిరెడ్డి ప్రోత్సాహంతోనే టీడీపీ  నేతలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించి, పథకం ప్రకారం దాడిచేశారని ఆరోపించారు. ఈ ఘటన గురించి తెలిసి రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునేలోపే టీడీపీ నాయకులు అక్కడ నుంచి పరారయ్యారు.

టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు  
టీడీపీ నేతల దాష్టీకంపై దళిత రైతు మేకల నరసయ్య, దళిత సర్పంచ్‌ శీనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు నలగట్ల సుబ్రహ్మణ్యం, మందల పవన్‌కుమార్, గుమ్మడి రాజాయాదవ్‌ తమపై దాడిచేయడమే కాకుండా కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top