‘వైఎస్సార్‌ చేయూత’లో టీడీపీ నేత మోసాలు

TDP Leader Fraud In YSR Cheyutha Scheme - Sakshi

టీడీపీ నేత సైబర్‌ నేరం

వైఎస్సార్‌ చేయూత పథకం లబ్ధిదారుల జాబితాలో పేర్లు మార్పు

96 మంది అనర్హుల పేర్లు చేర్చిన తెలుగు తమ్ముడు

నిందితుడిని గుర్తించే పనిలో ఉన్న అధికారులు

గిద్దలూరు రూరల్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వైఎస్సార్‌ చేయూత పథకాన్ని అభాసుపాల్జేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కంకణం కట్టుకున్నారు. అధికారులు రూపొందించిన జాబితాలో అర్హుల పేర్లను తారుమారు చేసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించాలని పథక రచన చేసి అడ్డంగా బుక్కయ్యారు. మండలంలోని సంజీవరాయునిపేట పంచాయతీ పరిధి చేయూత యాప్‌లో 96 మంది అర్హుల పేర్ల స్థానంలో అనర్హుల పేర్లను దొంగచాటుగా చేర్చి గందరగోళం సృష్టించారు. ఆ తర్వాత జాబితాను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ఇలా ఎందుకు జరిగిందో అర్థంగాక.. ఓ టీడీపీ నేత కుట్రను తొలుత కనిపెట్టలేక తలలు పట్టుకున్నారు.

ఇదీ..జరిగింది 
గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట పంచాయతీలో 105 మంది లబి్ధదారులు ఉన్నారు. అందులో ఒకరి వేలిముద్ర పడని కారణంతో, మరొకరు టైలర్‌ కావడంతో నగదు పడలేదు. మిగిలిన 103 మందిలో కేవలం ఏడుగురు అర్హులకు మాత్రమే పథకం వర్తించింది. మిగిలిన 96 మందిలో 24 మందికి బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ తప్పుగా నమోదు కావడంతో నగదు పడలేదు. 72 మంది అనర్హులకు బ్యాంకులో నగదు జమ కావడంతో వెంటనే విత్‌డ్రా చేసుకున్నారు.

అర్హులకు అందాల్సిన రూ.18 లక్షల నగదు అనర్హులకు చేరడంతో అర్హులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు పంపిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల జాబితాను ఓ టీడీపీ నేత ఆన్‌లైన్‌లో తారుమారు చేశాడు. ఓసీలు, మగవారు, చిన్న పిల్లల పేర్లు నమోదు చేశాడు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడిపై అర్హులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులకు నగదు మంజూరైంది. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎక్కడ అవినీతి జరిగిందో బయటకు తీయాలని అర్హులు కోరుతున్నారు.

అవును..నిజమే
గ్రామ సచివాలయం నుంచి మేము పంపిన జాబితా తారుమారైంది. ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. అనర్హులకు నగదు వచ్చినట్లు గుర్తించి నగదు విత్‌డ్రా చేసుకోకుండా బ్యాంకులకు నోటీసులు పంపించాం. అప్పటికే అంతా నగదు విత్‌డ్రా చేసుకున్నారు. పూర్తి విచారణ చేసి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. 
- రంగనాయకులు, ఇన్‌చార్జి ఎంపీడీఓ, గిద్దలూరు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top