అమెరికా వెళ్లిన ఏడు నెలలకే.. 

Suspicious death of Telugu student in America - Sakshi

తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి 

స్వగ్రామమైన బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి చేరిన మృతదేహం 

మార్టూరు: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ఏడు నెలలకే అనుమానాస్పదస్థితిలో అర్ధంతరంగా తనువు చాలించాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామానికి చెందిన గోవాడ రమేష్‌ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు గోవాడ నాగసాయి గోపి అరుణ్‌ కుమార్‌ (22) ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఎంఎస్‌ చదవడం కోసం గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు.

లాంనార్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతూ టెక్స్‌పోర్టన్‌ ఏరియాలో ఐదుగురు స్నేహితులతో కలిసి నివాసం ఉంటుండగా, వారితో ఒక యువతి కూడా ఉంటోంది. ఈ క్రమంలో మార్చి 1న అరుణ్‌ కుమార్‌ స్నేహితులకు కనిపించకుండా పోవడంతో గదిలోని స్నేహితురాలి ఫిర్యాదు మేరకు అమెరికా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు మార్చి 3వ తేదీన అరుణ్‌కుమార్‌ మృతదేహాన్ని వారి నివాసానికి సమీపంలో ఓ నీటి సరస్సులో గుర్తించి స్నేహితులకు, ఇండియాలోని తండ్రి రమేష్కు సమాచారం అందించారు. శవ పరీక్ష అనంతరం అరుణ్‌కుమార్‌ మృతదేహాన్ని అతని స్నేహితులు స్వంత ఖర్చులతో ఇండియా పంపగా.. శనివారం మధ్యాహ్నం స్వగ్రామం జొన్నతాళి చేరింది.

పోస్టుమార్టం నివేదిక వస్తేనే కానీ అరుణ్‌కుమార్‌ మృతికి కారణం తెలియదని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశించి అమెరికా పంపిస్తే శవమై తిరిగి వస్తాడని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. సాయంత్రం గ్రామంలో అరుణ్‌కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top