ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

Suspicious death of a state student in the Philippines - Sakshi

ఫిలిప్పీన్స్‌లో రాష్ట్ర విద్యార్థి అనుమానాస్పద మృతి

హత్య చేసి డ్రెయినేజీలో పడేశారని కుటుంబసభ్యుల ఆరోపణ 

మృతదేహాన్ని స్వస్థలం రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు 

భూదాన్‌పోచంపల్లి: వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్‌కు వెళ్లిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగి­రి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లికి చెందిన గూడూరు రాంరెడ్డి, రాధ దంపతుల కుమారుడు మణికాంత్‌రెడ్డి(21) ఫిలిప్పీన్స్‌లోని దావో మెడికల్‌ కాలేజీలో 2020లో ఎంబీబీఎస్‌లో చేరాడు. కరోనా కారణంగా కొద్దిరోజులు ఆన్‌లైన్‌లో క్లాసులు విన్నాడు.

గత ఏడాది ఆగస్టులో ఫిలిప్పీన్స్‌ వెళ్లాడు. ప్రస్తుతం థర్డ్‌ ఇయర్‌ పరీక్షలు రాస్తున్నాడు. అయితే.. ఆదివారం తెల్లవారుజామున మణికాంత్‌రెడ్డి ఉంటున్న హాస్టల్‌ మేనేజర్‌ రాంరెడ్డికి ఫోన్‌చేసి మీ కుమారుడు బైక్‌ యాక్సిడెంట్‌లో చనిపోయాడని, కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్‌చేసి మెట్లపై నుంచి జారి పడి మృతిచెందాడని చెప్పారు. మణికాంత్‌రెడ్డి మృతదేహం ఫొటో, వీడియో పంపించారు.

కాగా.. హాస్టల్‌ వెనుక డ్రెయినేజీలో మణికాంత్‌రెడ్డి మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. హాస్టల్‌ యాజమాన్యం, పోలీసులు చెప్పిన తీరు వేర్వేరుగా ఉండటంతో కుమారుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మణికాంత్‌రెడ్డి డ్రెయినేజీలో పడి ఉండటం,తలకు గాయం ఉండటంతో హత్యేనని ఆరోపిస్తున్నారు. కచ్చితంగా ఎవరో హత్య చేసి డ్రెయినేజీలో పడేసి ఉంటారని అంటున్నారు.

15 రోజుల క్రితం హాస్టల్‌లో మనదేశానికే చెందిన విద్యార్థులకు, మణికాంత్‌రెడ్డికి మధ్య గొడవ జరిగిందని, వారిలో ఎవరైనా ఘాతుకానికి పాల్పడ్డారా అనిఅనుమానిస్తున్నారు. మణికాంత్‌రెడ్డి మృతదేహాన్ని వెంటనే ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మంత్రి కేటీఆర్‌ను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి, ఫిలిప్పీన్స్‌లోని ఎంబసీతో పాటు, అక్కడి ఎన్‌ఆర్‌ఐలతోనూ మాట్లాడి.. మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. 

మేమెట్టా బతికేది 
నాలుగురోజుల కిందట మాట్లాడినం. హాస్టల్‌ ఫీజు కావాలంటే పంపించిన. ‘పరీక్షలు నడుస్తున్నయి, నేనే ఫోన్‌ చేసి మాట్లాడుతా’అన్నడు. శనివారం ఫోన్‌ చేస్తే కలువలేదు. ఆదివారం చేద్దామనుకొన్నం. ఈ లోపు ఘోరం జరిగిపోయింది. నా కొడుకు లేకుండా మేమెట్లా బతికేది.  – గూడూరు రాంరెడ్డి, మృతుడి తండ్రి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top