ఇంటిముందు మృతదేహం, డబ్బు, లేఖ

Suspicious death of Construction labor in Prakasam District - Sakshi

గుర్తుతెలియనివారు కారులో తీసుకొచ్చి పడేసిన వైనం 

ప్రకాశం జిల్లా ముటుకుల గ్రామంలో ఘటన

మృతుడు భవన నిర్మాణ కూలీ 

పుల్లలచెరువు/యర్రగొండపాలెం: ఒక యువకుడి మృతదేహాన్ని కొందరు వ్యక్తులు కారులో తీసుకొచ్చి అతడి ఇంటిముందు పడేసి వెళ్లిన సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో సంచలనం కలిగించింది. మృతదేహంతోపాటు రూ.35 వేలు, క్షమాపణ లేఖ ఉంచి వెళ్లారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. మృతుడు ఉప్పు శ్రీను (35) భవన నిర్మాణ పనుల్లో కూలీగా చేస్తుంటాడు. పనుల కోసం ముఠావాళ్లతో చెన్నై, తెలంగాణ, ఇతర దూర ప్రాంతాలకు వెళుతుంటాడు. 10 రోజుల కిందట పనులకు చెన్నై వెళ్లాడు.

అతడికి నయంకాని వ్యాధి ఉన్నట్లు గుర్తించిన భార్య పిల్లలను తీసుకుని రెండేళ్ల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కొందరు వ్యక్తులు తెల్లటి కారులో శ్రీను మృతదేహాన్ని తీసుకొచ్చి అతడి ఇంటిముందు పడేసి వెళ్లారు. మట్టి ఖర్చులకు రూ.35 వేలు, క్షమాపణ లేఖ అక్కడ  ఉంచి వెళ్లారు. ఆ లేఖలో ‘అమ్మా.. పనిచేసే ప్రదేశంలో అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈ క్రమంలో మీ అబ్బాయి చనిపోయాడు. మాకు దెబ్బలు తగిలాయి. తల్లి శోకం తీర్చలేనిదని మాకు తెలుసు. కానీ ఏమీచేయలేక పోయాం.

మీ అబ్బాయి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.35 వేలు ఇస్తున్నాం. అమ్మా క్షమించండి..’ అని రాసి ఉంది. ఈ లేఖను బట్టి భవన నిర్మాణ పనులు జరిగే సమయంలో తోటి కూలీలతోపాటు శ్రీను కిందపడి ఉంటాడని, ఈ నేపథ్యంలో అతను చనిపోగా మరికొందరికి దెబ్బలు తగిలి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని అప్పజెప్పే తరుణంలో గ్రామస్తులు తమపై దాడిచేసే అవకాశం ఉందని, పోలీసు కేసులు అవుతాయనే భయంతో ఇంటిముందు పడేసి వెళ్లి ఉండవచ్చని అనుకుంటున్నారు. మృతుడి ఇంట్లో దొరికిన మందులు, పరీక్షల రిపోర్టును బట్టి అతనికి నయంకాని వ్యాధి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సీఐ కె.మారుతీకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ వై.శ్రీహరి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top