విచ్చలవిడిగా వన్య ప్రాణుల వేట

Smuggling Of Rare Animals Is Steadily Increasing In State - Sakshi

అంతర్జాతీయ ముఠాల స్మగ్లింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో, రాష్ట్రంలో వన్యప్రాణులు, అరుదైన జంతువుల వేట, అక్రమ రవాణా క్రమంగా పెరుగుతోంది. వివిధ దేశాల్లో వీటి శరీర భాగాలకు డిమాండ్‌ పెరగడంతో అంతర్జాతీయ స్మగ్లింగ్‌ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పులులు, చిరుతల చర్మం, గోళ్లు, దంతాలు, ఎముకలు, కొవ్వు, మీసాలు, ఉడుముల జననాంగాలు,  పాంగోలిన్‌ చర్మం, పొలుసులు, ముంగిస జుట్టు, పాములు, తాబేలు చర్మాలు ఇలా వివిధ శరీర అవయవాలకు విదేశాల్లో బాగా డిమాండ్‌ ఉంది.

దీంతో మన అడవుల్లో వీటిని వేటాడేందుకు లేదా అక్రమ రవాణాకు అంతర్జాతీయ సంబంధాలున్న స్మగ్లింగ్‌ ముఠాలు పనిచేస్తున్నాయి. నిందితులను పట్టుకుంటున్నా ఈ గ్యాంగ్‌ల వెనక ఎవరున్నారు, వీటి తరలింపు అంతిమ లక్ష్యం లేదా గమ్యస్థానం ఏమిటో కనుక్కోవడంలో మాత్రం అటవీ అధికారులు, పోలీసులు విఫలమౌతున్నారు. వన్య ప్రాణుల వేట, తరలింపుపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణలో అటవీ శాఖ 24 గంటలు పనిచేసేలా ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్‌ కంట్రోల్‌ రూంను, టోల్‌ఫ్రీ నంబర్‌ను గతంలోనే ఏర్పాటు చేసింది.

ఈ నంబర్‌కు 6,500కు పైగా కాల్స్‌ రాగా వాటిలో నాలుగు వేల దాకా వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా, రక్షణకు సంబంధించినవే ఉన్నాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో అరణ్య భవన్‌ ప్రధాన కార్యాలయం నుంచే ఈ ఫిర్యాదులపై ఒక ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. మిగతా అన్ని ఫిర్యాదులపై జిల్లాల్లోనే కార్యాచరణ చేపడుతున్నారు. అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో ఒక యాంటీ పోచింగ్‌ స్క్వాడ్, ఆమ్రాబాద్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లలో చెరొకటి, మిగతా 8 అటవీ సర్కిళ్లలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల ద్వారా వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

పొరుగు రాష్ట్రాలతో సమన్వయంతో పాటు అటవీ, పోలీస్, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, రెవెన్యూ ఇంటలిజెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, కస్టమ్స్, రైల్వేస్, సీఐఎస్‌ఎఫ్, ఫోరెన్సిక్, సీసీఎంబీ, జులాజికల్‌ సర్వే, బ్యూరో ఆఫ్‌ స్టాండర్డ్స్, పోస్టల్‌ తదితర జాతీయ స్థాయి ఏజెన్సీల అధికారుల సంయుక్త కృషితో దీనికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల అరణ్యభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో అడిషనల్‌ డైరెక్టర్‌ తిలోత్తమ వర్మ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top