ప్రియుడే కాలయముడు 

Police Solved 10th Class Student Molestation Case In Vikarabad - Sakshi

మైనర్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు

పరిగి: మైనర్‌పై అత్యాచారం, హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రేమికుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ‘పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని (15), అదే గ్రామానికి చెందిన కావలి మహేందర్‌ (నాని) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈ వ్యవహారం మైనర్‌ కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో 27వ తేదీన కూతురును తల్లి మందలించింది. ఈ విషయాన్ని సదరు మైనర్‌ మహేందర్‌కు చెప్పడంతో 28న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రమ్మని చెప్పాడు. లైంగిక వాంఛ తీర్చాలని మహేందర్‌ ఒత్తిడి చేయడంతో ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యతోపులాట జరిగింది.

ఆమెను పక్కకుతోయడంతో తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయింది. అదే సమయంలో ఆమెపై అత్యాచారం చేయడంతో ఊపిరి ఆడక మైనర్‌ మృతి చెందింది. చనిపోయిందని నిర్ధారించుకున్నాక మహేందర్‌ తన స్నేహితుడు సుఖిందర్‌ ఇంటికి వెళ్లాడు. తెల్లారాక ఇద్దరూ కలసి ఘటనా స్థలంలో దూరం నుంచి మరోసారి మైనర్‌ మృతదేహాన్ని చూసి వెళ్లిపోయారు’అని ఎస్పీ చెప్పారు.

క్లూస్‌ టీం సేకరించిన ఆధారాలతో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. తల్లిని కూడా విచారించామని, అయితే ఆమె పాత్ర లేదని చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. అబ్బాయిల ప్రలోభాలకు అమ్మాయిలు గురికావొద్దని ఎస్పీ సూచించారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top