Missing Cases: ఒంటరిగా అదృశ్యం.. జంటగా ప్రత్యక్షం

Mystery Behing Missing Cases In Hyderabad - Sakshi

సాక్షి, దౌల్తాబాద్‌ (హైదరాబాద్‌): యువతీ యువకులు ఒంటరిగా అదృశ్యమై ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి తిరిగి కొద్ది రోజులకే జంటగా పోలీస్‌స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఒక వైపు ఇరువురి బంధువులు వారి కోసం వెతుకుతుంటే.. మరో వైపు ప్రేమ వివాహాలు చేసుకున్న వారంతా ఇళ్లకు వెళ్లకుండా కుటుంబసభ్యుల   నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ నేరుగా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు మేము ప్రేమ వివాహం చేసుకున్నామని కుటుంబసభ్యులకు వాట్సాప్‌ ద్వారా పెళ్లి  ఫోటోలు పంపుతున్నారు.  

► కొడంగల్‌ సర్కిల్‌లోని దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 30 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. వాటిలో 28 కేసులను పోలీసులు పరిష్కరించారు.  
► నిత్యం వివిధ కేసుల్లో బిజీగా ఉండే పోలీసులకు ఈ మిస్సింగ్‌ కేసులు తలనొప్పిగా మారాయి.  
► అదృశ్యమైన యువతీయువకులు వివాహం అనంతరం తమకు రక్షణ కావాలని వస్తుండగా వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.  
► మైనర్ల అదృశ్యం కేసుల విషయానికొస్తే బాలికను తీసుకెళ్లిన వారిపై కిడ్నాప్‌  కింద కేసు నమోదు చేసి బాలిక అదృశ్యానికి కారణమైన వారిని రిమాండ్‌కు తరలిస్తున్నారు. 
► ఆన్‌లైన్‌ క్లాసుల నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్‌ల వాడకం పెరిగింది.  
► సెల్‌ఫోన్లలో వాట్సాప్, ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయాలు ఏర్పడి అదృశ్యాలకు దారితీస్తోంది. 

ఫిర్యాదు అందిన వెంటనే కేసు.. 
► కొడంగల్‌ సర్కిల్‌ పరిధిలో వచ్చే మిస్సింగ్‌ కేసులపై ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.  
► తమ అమ్మాయిని వివాహం చేసుకున్న అబ్బాయితో ముందు జాగ్రత్తగా పత్రం రాయించాలని కొందరు కుటుంబసభ్యులు పోలీసులను కోరుతున్నారు. 
► సాధ్యమైనంత వరకు అమ్మాయిలు తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాలు చేసుకోవాలని  తొందర పాటునిర్ణయాలు మంచివి కావని  పోలీసులు హెచ్చరిస్తున్నారు.     

పిల్లలపై పర్యవేక్షణ అవసరం
కొడంగల్‌ సర్కిల్‌ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 30 కేసులు నమోదు కాగా 28 పరిష్కరించాం. మిగిలిన రెండు కేసులు దౌల్తాబాద్‌లో పెండింగ్‌ ఉన్నాయి. వాటినికూడా త్వరలో పరిష్కరిస్తాం. అదృశ్యమైన యువతీయువకులను వారిస్నేహితుల ఆ«ధారంగా గుర్తిస్తున్నాం. ఆన్‌లైన్‌ తరగతుల అనంతరం పిల్లల ఫోన్లను తల్లిదండ్రులు తరుచూ గమనిస్తూ ఉండాలి.    

– అప్పయ్య, సీఐ, కొడంగల్‌  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top