ఏమైందీ పోలీసుకీ.. ∙ఖా‘కీచకుడిగా’ మారిన ఓ ఇన్‌స్పెక్టర్‌.. 

Marredpally SI K Nageshwar Rao Molested Charges case Update - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/హస్తినాపురం: వివాహిత కణితికి తుపాకీ గురిపెట్టి అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా మారిన ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఒకప్పుడు కేవలం అవినీతి ఆరోపణలు మాత్రమే ఎదుర్కొనే పోలీసులు కాలక్రమంలో ‘అప్‌డేట్‌’ అవుతూ వచ్చారు. హత్య కేసుల్లో నిందితులకు సహకరించడంతో పాటు ఏకంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అత్యాచారాలు చేసే వరకు వెళ్లారు. ఉన్నతాధికారులు మాత్రం ఈ వ్యవహారాలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. 

మామూళ్లతో మొదలై సెటిల్‌మెంట్ల దాకా..  
పోలీసు విభాగంలో పని చేసే అధికారులు, సిబ్బందికి ఒకప్పుడు రోజు, వారం, నెల వారీ మామూళ్లు వసూలు చేసే విధానం ఉండేది. దీనికోసం ప్రత్యేకంగా కలెక్టర్లు, రోడ్‌ మాస్టర్లుగా కొందరు సిబ్బంది పని చేసే వాళ్లు. ఆ తర్వాత కేసుల్లో కాసుల దందాలు మొదలయ్యాయి. కొన్ని కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలన్నా, మరికొన్నింటిలో నిందితులకు మేలు చేయాలన్నా రేట్లు కట్టి మరీ వసూలు చేయడం మొదలెట్టారు. రాజధానిలో రియల్‌ బూమ్‌ మొదలైన తర్వాత పోలీసులకు పండగ వచ్చిపడింది. సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకుని సెటిల్‌మెంట్లు చేస్తూ రెండు చేతులా సంపాదించడం మొదలెట్టారు. ఆయా ఆరోపణలపై అనేక మందిపై ఏసీబీ కేసులు, క్రిమినల్‌ కేసులు, అరెస్టులు, వేటులు కూడా జరిగాయి. 

హత్యలు, అత్యాచారాలు..  
కొన్నేళ్లుగా హత్యలు, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లోనూ వీరి పేర్లు బయటకు రావడం, నిందితులుగా నమోదు కావడం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జయరామ్‌ హత్య కేసులో నిందితుడు రాకేష్‌రెడ్డికి సహకరించారనే ఆరోపణలపై ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు రాంబాబు, శ్రీనివాసులుపై వేటు పడింది. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగినితో అభ్యంతరకర ప్రవర్తన ఆరోపణలపై ఇన్‌స్పెక్టర్‌ చంద్రకుమార్‌పై నిర్భయ కేసు నమోదైంది. ఇలాంటి ఉదంతాలు మరికొన్ని ఉన్నా.. తాజాగా ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావుపై వచ్చిన ఆరోపణలు గతానికి భిన్నంగా అత్యంత తీవ్రంగా ఉన్నాయి.

అధికారులు సీరియస్‌..
వినీతి ఇతర ఆరోపణల విషయంలో కంటే మహిళలపై జరిగే అత్యాచారం తదితర ఆరోపణలు వచ్చిన అధికారుల విషయాన్ని ఉన్నతాధికారులు మరింత సీరియస్‌గా తీసుకుంటున్నారు. నాగేశ్వర్‌రావు విషయానికే వస్తే... గురువారం బాధితురాలి ఫిర్యాదుతో వనస్థలిపురం ఠాణాలో కేసు నమోదైంది. వెంటనే స్పందించిన అధికారులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించడం, ఆమెతో భరోసా కేంద్రంలో వాంగ్మూలం తీసుకోవడంతో పాటు క్లూస్‌ టీమ్‌తో ఆమె ఇంట్లో పలు ఆధారాలు సేకరించేలా చర్యలు తీసుకున్నారు. బాధితురాలి వాంగ్మూలంతో ఇబ్రహీంపట్పం చెరువు వద్ద ప్రమాదం బయటపడింది. దీంతో సుమోటోగా మరో కేసు నమోదు చేయించారు. నగర కొత్వాల్‌ స్పందించి నాగేశ్వర్‌రావును సస్పెండ్‌ చేసి  అంతర్గత విచారణకు ఆదేశించారు. 

కారులో తీసుకెళ్లి హత్యకు యత్నం..
సీఐ నాగేశ్వర్‌రావు తమను కారులో నగర శివార్లకు తీసుకువెళ్లి హత్య చేయాలని భావించాడు. ఆయన నాలుగేళ్లుగా మా కుటుంబాన్ని వేధిస్తున్నాడు. 2018 కేసులో బెయిల్‌పై వచ్చినప్పటి నుంచి యాచారంలోని తన వ్యవసాయ క్షేత్రంలో బలవంతంగా పని చేయిస్తున్నాడు. మానేస్తే మరో కేసులో ఇరికిస్తానంటూ 24 గంటలూ చాకిరీ చేయిస్తున్నాడు. మమ్మల్ని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తీసుకువెళ్లి గంజాయితో ఫొటోలు, వీడియోలు తీసినప్పుడు నన్ను గంజాయి కేసులో, నా భార్యను వ్యభిచారం కేసులో జైలుకు పంపిస్తానంటూ రాయించుకుని వదిలాడు.

నా భార్యకు కరోనా  సోకడంతో పిల్లల్ని ఊరిలో వదిలిరావడానికి బుధవారం వెళ్లా. ఆ రోజు ఇన్‌స్పెక్టర్‌ నా భార్యకు ఫోన్‌ చేసిన విషయం నాకు చెప్పింది. దీంతో గురువారం రాత్రి 9.30 గంటలకు వచ్చేశా. జ్వరంతో ఉన్న నా భార్యకు టిఫిన్‌ తీసుకురావడానికి బయటకు వెళ్లా. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. బలవంతంగా తెరవగా నా భార్యపై అత్యాచారం చేసిన నాగేశ్వర్‌రావు కనిపించాడు. ఆత్మరక్షణ కోసం అతడిపై దాడి చేశా. ఈ గలాభా విని ఇరుగుపొరుగు వాళ్లు రాగా... భార్యభర్తల గొడవని చెప్పాలని నాగేశ్వర్‌రావు బెదిరించడంతో అలానే చేశా.

తెల్లవారుజాము మూడు గంటల వరకు నన్ను, నా భార్యను మోకాళ్లపై కూర్చో బెట్టి చంపేస్తానని బెదిరించాడు. మూడున్నర గంటలకు అతడి కారులో కిడ్నాప్‌ చేశాడు. నా కణతపై తుపాకీ గురిపెట్టి నాగార్జునసాగర్‌ రోడ్‌లో వెళ్లమన్నాడు. ఇబ్రహీంపట్నం చెరువు ప్రాంతంలో నేను నడుపుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. నేను, ఇన్‌స్పెక్టర్‌ బయట ఎగిరిపడగా... వెనుక సీట్లోని నా భార్య అందులోనే ఉండిపోయింది. ముందు సీట్లో నుంచి ఆమెను బయటికి తీస్తుండగా సీఐకి చెందిన రెండు సెల్‌ఫోన్లు కనిపించా యి. అవి తీసుకుని ఇబ్రహీంపట్నం చెరువు కట్టపైకి వెళ్లా. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా మమ్మల్ని వెంబడిస్తాడని గ్రహించి వాటిని చెరువులో పడేసి ఆర్టీసీ బస్సులో తిరిగి వచ్చాం.  
∙మీడియాకు విడుదల చేసిన వీడియోలో బాధితురాలి భర్త. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top