జల్సాలకు అలవాటు పడి కన్నకొడుకునే!

Man Sold His Kid For Alcohol In Hyderabad - Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌: జల్సాలకు అలవాటుపడి అప్పులు చేసి వాటిని తీర్చేందుకు కన్నకుమారుడిని విక్రయించిన తండ్రితో పాటు సహకరించిన ఇద్దరు మధ్యవర్తులు, కొనుగోలు చేసిన భార్యాభర్తలను రాజేంద్రనగర్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరివద్ద నుంచి రెండు నెలల చిన్నారి బాలుడిని సురక్షితంగా కాపాడి తల్లికి అప్పగించారు. ఐదు సెల్‌ఫోన్‌లతో పాటు రూ.2.40లక్షల స్వాదీనం చేసుకున్నారు.

ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం ఎంఎంపహాడీ ప్రాంతానికి చెందిన హైదర్‌ఆలీ(24), షహానాబేగం(20) భార్యాభర్తలు. వీరికి ఏడాదిన్నర కిందట వివాహమయింది. వృత్తి రీత్యా ఆటో డ్రైవర్‌ అయిన హైదర్‌ఆలీ జల్సాలకు అలవాటుపడి అప్పులు చేశాడు. రెండు నెలల కిందట వీరికి పండంటి మగబిడ్డ పుట్టాడు. అప్పటి నుంచి హైదర్‌ఆలీ బాలుడిని విక్రయించి డబ్బుతో అప్పులను తీరుద్దామంటూ భార్య షహానాబేగంకు తెలుపుతున్నాడు. షహానాబేగం అంతగా పట్టించుకోలేదు.

ఈ నెల 15న సాయంత్రం షహానాబేగం రంజాన్‌ ఉపవాస దీక్ష నేపథ్యంలో ప్రార్థన చేస్తున్న సమయంలో హైదర్‌ఆలీ కుమారుడిని ఆడిస్తున్నట్లు నటించి బయటకు తీసుకువెళ్లాడు. వట్టెపల్లికి చెందిన మ్యారేజ్‌ బ్యూరో బ్రోకర్‌ హజేరాబేగం(28), కిషన్‌బాగ్‌కు చెందిన రేష్మాబేగం(23)లను సంప్రదించి రూ.3.80లక్షలకు కుమారుడిని విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ముగ్గురు కలిసి టోలీచౌకిలోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన భార్యాభర్తలు అబ్దుల్‌ రియాజ్‌(38), సహేదామహ్మద్‌(38)లకు  పిల్లలు కాకపోవడంతో వారు చిన్నారిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

బాలుడిని అమ్మిన హైదర్‌అలీ  తల్లి షహానాబేగం వద్దకు వెళ్లాడు. ఆయన భార్య హైదర్‌ఆలీకి ఫోన్‌చేయగా తల్లి వద్ద ఉన్నానని, సోదరి వద్ద ఉన్నానంటూ తెలిపాడు. మరుసటి రోజు విషయాన్ని షహానాబేగం తల్లిదండ్రులకు తెలపడంతో వారు ఫోన్‌లో సంప్రదించగా హైదర్‌ఆలీ బాలుడిని విక్రయించానని తెలపడంతో రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి శంషాబాద్‌ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్‌ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి ఐదుగురిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని తల్లికి అప్పగించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top