Prakasam Crime: తన ఇద్దరి బిడ్డలను బైకుపై తీసుకువచ్చి.. పానీపూరి తినిపించి..

Man Jumps Into Canal With Two Kids In Prakasam District - Sakshi

సాగర్‌ కాలువలో ఇద్దరు బిడ్డలతో సహా దూకి తండ్రి ఆత్మహత్య  

బల్లికురవ(ప్రకాశం జిల్లా): శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లకని చెప్పి వెళ్లిన ఓ తండ్రి తన ఇద్దరు బిడ్డలతో సాగర్‌ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బల్లికురవ మండలం గుంటుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తండ్రి మృతదేహం లభించగా, అతని వెంట వెళ్లిన చిన్నారుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బల్లికురవ మండలంలోని గుంటుపల్లి గ్రామానికి చెందిన గుర్రం చిరంజీవి (36)కి 11 ఏళ్ల క్రితం మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన కల్యాణితో వివాహమైంది. వీరికి కుమారుడు శాయి చైతన్య కృష్ణ (10), శాయి సౌమ్య (8) ఉన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చైతన్య కృష్ణ నాల్గవ తరగతి, సౌమ్య 3వ తరగతి చదువుతున్నారు. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా పానీపూరి కావాలని పిల్లలు తండ్రి చిరంజీవిని కోరారు.

చదవండి: అనూస్‌ పేరుతో బ్యూటీ పార్లర్‌.. స్థానికులతో పరిచయం పెంచుకుని.. చివరికి

బల్లికురవ తీసుకెళ్లి పానీపూరి తినిపించి అక్కడ నుంచి కోటప్పకొండ తిరునాళ్లకు తీసుకెళ్తానని భార్యకు చెప్పాడు. బైకుపై తీసుకువచ్చి పానీపూరి తినిపించి అక్కడ నుంచి అద్దంకి బయలుదేరాడు. దారిలో సాగర్‌ అద్దంకి బ్రాంచ్‌ కాలువ వల్లాపల్లి లాకుల వద్ద బైకును నిలిపాడు. చిరంజీవి ఇద్దరు బిడ్డలతో సాగర్‌ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయానికి తిరునాళ్లకని వెళ్లిన భర్త, పిల్లలు తిరిగి రాకపోవడంతో కోటప్పకొండలోని బంధువుల ఇళ్ల వద్ద కల్యాణి విచారించింది.

ఆచూకీ లభించలేదు. సాగర్‌ కాలువ వల్లాపల్లి లాకుల వద్ద చిరంజీవి బైకు, చెప్పులు, కుమారుడు చైతన్య కృష్ణ చెప్పులు ఉన్నాయన్న సమాచారం అందడంతో బల్లికురవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై వి.వేమన మిస్సింగ్‌ కేసు నమోదుతో దర్యాప్తు చేపట్టారు. గజ ఈతగాళ్లతో సాగర్‌ కాలువలో గాలింపు చేపట్టారు. బొల్లాపల్లి లాకుల వద్ద చిరంజీవి మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు సీహెచ్‌సీకి తరలించారు. చిన్నారుల కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. చిరంజీవికి రూ.20 లక్షలకుపైగా అప్పులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అతను మదనపడుతుండేవాడని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top