రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత 

Hyderabad: Large Quantity Of Cannabis Was Seized - Sakshi

నర్సరీ మొక్కల మాటున 3,400 కిలోల సరుకు 

రవాణా ట్రక్కు జప్తు.. ముగ్గురు వ్యక్తుల అరెస్టు 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. నగర శివార్లలోని ఔటర్‌ రింగ్‌రోడ్డు టోల్‌ప్లాజా వద్ద రూ.21 కోట్లు విలువచేసే 3,400 కిలోల గంజాయిని తరలిస్తున్న ట్రక్కును నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు శుక్రవారం పట్టుకుని జప్తుచేశారు. 141 గన్నీ సంచుల్లో సరుకు నింపి, బయటకు కనిపించకుండా టార్పాలిన్‌ షీట్లతో కప్పేశారు. అనుమానం రాకుండా దానిపై నర్సరీ మొక్కలను లోడ్‌చేశారు. దీనిపై బెంగళూరు ఎన్‌సీబీ నుంచి అందిన సమాచారంతో ఎన్‌సీబీ హైదరాబాద్, బెంగళూరు బృందాలు సంయుక్తంగా దాడిచేసి  ట్రక్కును పట్టుకున్నాయి.

మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కలిగిన ట్రక్కులో ప్రయాణిస్తున్న మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లాకు చెందిన డి.షిండే, ఎంఆర్‌ కాంబ్లే, ఎన్‌.జోగ్‌దండ్‌ను అరెస్టుచేశారు. గతంలో నిర్వహించిన ఓ ఆపరేషన్‌లో 3,992 కిలోల గంజాయిని జప్తుచేసుకుని 16 మందిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో లభించిన సమాచారం ఆధారంగా మరో మూడు స్మగ్లర్ల నెట్‌వర్క్‌లను ఎన్‌సీబీ ఛేదించింది. గత ఆపరేషన్‌ ద్వారా లభించిన సమాచారంతోనే తాజాగా మరోసారి పట్టుకున్నట్టు ఎన్‌సీబీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

మహారాష్ట్ర కేంద్రంగా దందా నడుపుతున్న ఓ కీలక వ్యక్తి తాజాగా పట్టుబడిన ముఠా వెనక ఉన్నట్టు ఎన్‌సీబీ గుర్తించింది. ముంబై, పూణె, థానెతో పాటు ఇతర రాష్ట్రాల్లోని డ్రగ్స్‌ సిండికేట్ల కోసం అతడు ఈ సరుకును తరలించేందుకు ఏర్పాట్లు చేశాడని తెలిపింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని సిండికేట్ల ద్వారా కళాశాలల విద్యార్థులు, పార్టీలు, వ్యక్తులకు సరఫరా చేస్తున్నారని పేర్కొంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top