22 లక్షలతో పారిపోయి.. కోర్టులో లొంగిపోయి

Hyderabad: Bank Cashier Escaped With Rs 22. 53 Lakh Surrenders At Court - Sakshi

హయత్‌నగర్‌ కోర్టులో లొంగిపోయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్యాషియర్‌ ప్రవీణ్‌ 

బ్యాంకులో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపణ 

త్వరలోనే సాక్ష్యాధారాలతో బయటపెడతానని వెల్లడి  

హస్తినాపురం: రూ. 22.53 లక్షలతో ఉడాయించాడని ఆరోపణలు ఎదుర్కొంటూ వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లోని బ్యాంకు ఆఫ్‌ బరోడా (బీఓబీ) క్యాషియర్‌ ప్రవీణ్‌కుమార్‌ హయత్‌నగర్‌ కోర్టులో సోమవారం లొంగిపోయాడు. మీడియాలో వచ్చిన వార్తా కథనాలకు విరక్తి చెంది అవమానం భరించలేక మణికట్టు కోసుకుని ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని చెప్పారు.

తాను వారణాసి, గోవా వెళ్లలేదని, వనస్థలిపురం నుంచి నేరుగా నల్లగొండ జిల్లా చిట్యాలకు బైక్‌పై వెళ్లి అక్కడ బైక్‌ను వదిలేసి ఆటోలో నల్లగొండకు, అక్కడి నుంచి బస్సులో దేవరకొండ మీదుగా జడ్చర్లకు వెళ్లానన్నారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వర్షంలో తడిచి ఓ గ్రామానికి వెళ్లి ఇతరుల ఫోన్‌ సాయంతో ఇన్‌స్టాగ్రామ్‌లో మీడియాకు సెల్ఫీ వీడియో పెట్టానని తెలిపారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తన బాధలు చెప్పుకోవడానికే ఇక్కడకి వచ్చానని, ఇప్పటికీ తనకు జరిగిన అవమానానికి బతకాలని లేదని అన్నారు.  

బ్యాంకులో అంతర్జాతీయ స్థాయి కుంభకోణం: ప్రవీణ్‌ 
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో అంతర్జాతీయ స్థాయిలో కుంభకోణం జరుగుతోందని ప్రవీణ్‌ ఆరోపించారు. బ్యాంకులో లాకర్‌కు పెట్టాల్సిన సీసీ కెమెరాలు వాటికి కాకుండా కిందికి పెట్టారని, తాను బయటికి రాగానే నిజాలను సాక్ష్యాలతో బయటపెడతానని కోర్టు బయట మీడియాకు చెప్పారు. తనను ఈ స్థాయికి తెచ్చిన వారిని వదిలిపెట్టబోనని, అన్ని నిజాలు త్వరలోనే బట్టబయలు చేస్తానని అన్నారు.  

ఇంతకీ ఏం జరిగిందంటే.. 
ప్రవీణ్‌ గత మంగళవారం బ్యాంకుకు వచ్చాక కాసేపటికే కడుపు నొప్పి వస్తోందని చీఫ్‌ మేనేజర్‌ దగ్గర పర్మిషన్‌ తీసుకుని బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకూ తిరిగి రాకపోవడం, ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ రావడంతో కంగారు చెందిన చీఫ్‌ మేనేజర్‌ క్యాష్‌ కౌంటర్‌ దగ్గరకు వెళ్లి సిబ్బంది సమక్షంలో నగదు లెక్కించగా రూ. 22.53 లక్షలు తక్కువ వచ్చింది. దీంతో ప్రవీణ్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రవీణ్‌ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని, క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడని బ్యాంక్‌ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top