బాలిక మృతిపై స్పందించని క్వారీ యాజమాన్యం

Harika Quary Death: Harika Parents Demands 25 Lakhs Compensation - Sakshi

క్వారీ ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు

పరిహారం చెల్లించాలని వైఎస్సార్‌సీపీతో పాటు మిగతా పార్టీలు డిమాండ్‌

క్వారీ యాజమాన్యంపై నాయకుల ఆగ్రహం

వంగర:  శ్రీకాకుళం జిల్లా వంగర మండల పరిధి నీలయ్యవలస సమీపంలో బేతిన్‌ గ్రానైట్‌ క్వారీ ప్రదేశాన్ని పాలకొండ ఆర్డీవో టి.వి.ఎస్‌.జి.కుమార్, డీఎస్పీ మల్లంపాటి శ్రావణి గురువారం పరిశీలించారు. ఈ నెల 1వ తేదీన దుస్తులు ఉతికేందుకు తల్లి తొగరాపు సంతోషికుమారితో వెళ్లిన కుమార్తె హారిక క్వారీ గొయ్యిలో పడి మృతిచెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై సమగ్ర సమాచారం సేకరణకు క్వారీ ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు. క్వారీ లీజు సమయం, నిర్వహణ కాలం, ఎప్పటి నుంచి మూసివేశారు, హెచ్చరిక బోర్డులు, రక్షణ కంచెలు వంటివి తనిఖీ చేశారు. క్వారీకి సంబంధించి సమగ్ర సమాచారంపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ డి.ఐజాక్‌ను ఆర్డీవో ఆదేశించారు. ఘటనకు సంబంధించిన అంశాలపై డీఎస్పీ ఆరా తీశారు. రాజాం రూరల్‌ సీఐ డి.నవీన్‌కుమార్, ఎస్సై సంచాన చిరంజీవి, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: ‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన) 

రూ.25 లక్షలు చెల్లించాలి..
హారిక కుటుంబానికి క్వారీ యాజమాన్యం రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కరణం సుదర్శనరావుతోపాటు సర్పంచ్‌ ప్రతినిధి చింతగుంట రామారావు, పలు పార్టీలకు చెందిన నాయకులు బెజ్జిపురం రవి, ఉత్తరావెల్లి మోహనరావు, మజ్జి గణపతిరావు డిమాండ్‌ చేశారు. హారిక కుటుంబ సభ్యులను క్వారీ యాజమాన్య ప్రతినిధులు కనీసం ఓదార్చలేదని, ఇప్పటివరకు పరామర్శించలేదని మండిపడ్డారు.

క్వారీ గుంత వద్ద హారిక మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి, కుటుంబసభ్యులు (ఫైల్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top