
భోపాల్: ఇదొక కల్లోలం.. ముగ్గురి జీవితాలపై విధి ఆడిన వింత నాటకం. సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక్క ఉదుటను దూకిన ‘మృత్యుఘోష’. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురైతే, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొకరు ఆత్మాహుతి చేసుకున్నారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ విషాద ఘటన తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురౌవుతుంది.
రాష్ట్రంలోని బాహ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో సిహోలియా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ముందుగా భార్యను చంపిన భర్త ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. మెడకు ఉరితాడు బిగించుకుని తాను కూడా ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత మనవడి మరణాన్ని జీర్ణించుకోలేని తాత.. అదే చితిమంటల్లో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు.
అభయ్ రాజ్ అనే 34 ఏళ్ల వ్యక్తి.. భార్య సవితా యాదవ్(31)ను హత్య చేశాడు. ఇక తనులేని జీవితం వద్దనుకున్నాడో, లేక జైలు పాలు కావాల్సి వస్తుందని భయపడ్డాడో కానీ ఉరి వేసుకుని అతను కూడా తనువు చాలించాడు. ఇది శుక్రవారం ఉదయం జరగ్గా, అదే రోజు సాయంత్ర వారి అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే మనవడిఅభయ్ రాజ్) లేని జీవితం వద్దనుకున్న తాత రామావతార్.. తాను కూడా ఆ మనవడి అంత్యక్రియలు నిర్వహించిన చితి మంటల్లోనే దూకి ప్రాణం తీసుకున్నాడు. అయితే శనివారం ఉదయమే ఈ వార్త తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కాలిన మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఒక హత్య, రెండు ఆత్మహత్యల వెనుక కారణాలు ఏమిటో తెలియలేదని సిధి జిల్లా డీఎస్పీ గాయత్రి తివారీ తెలిపారు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.