హిజ్రాల వేధింపులతో బాలిక ఆత్మహత్య

Girl Commits Suicide Due To Harassment Of Hijras In Vijayawada - Sakshi

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): తీసుకున్న అప్పు తీర్చలేదని హిజ్రాలు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెంది బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. తంబి దాసు, పద్మ దంపతులు. నగరంలోని ఒక హోటల్లో పనిచేసుకుంటూ ఇద్దరు కూతుళ్లతో కలసి డీమార్టు వెనుక, బావాజీపేట 2వ లైన్‌లో నివాసముంటున్నారు.

పెద్ద కూతురు ల్యాబ్‌లో పనిచేస్తుండగా రెండవ కుమార్తె తంబి అనురాధ (18) నగరంలోని ఒక కళాశాలలో ఇంటర్‌ చదువుకుంటుంది. ఇటీవల ఇంటి అవసరాల మేరకు కుటుంబసభ్యులు తమకు తెలిసిన ఒక హిజ్రా వద్ద రూ.10 వేలు అప్పుగా తీసుకున్నారు. సకాలంలో అప్పు తీర్చకపోవడంతో సోమవారం రాత్రి కొంతమంది హిజ్రాలు వారి ఇంటి ముందుకు చేరి అసభ్యకరంగా దూషణలకు దిగారు.

దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన అనురాధ మంగళవారం ఉదయం తల్లిదండ్రులు పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 11.30 గంటల సమయంలో బాలిక అమ్మమ్మ కొమ్మూరి నరసమ్మ కూరగాయలు ఇచ్చేందుకు ఇంటికి వచ్చి చూడగా బాలిక ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది.

వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి స్థానికుల సాయంతో లోపలికి కిందికి దింపి ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీనిపై ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చదవండి: భర్త కాదు.. మృగం.. భార్యను దారుణంగా..  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top