తండ్రి చేసిన అప్పుకు తనయుడి ఖాతా స్తంభన, నిండు ప్రాణం బలి

Farmer deceased Over Unable To Withdraw Money Bank Account Frozen Loan Default - Sakshi

వైద్యానికి డబ్బు లేక రైతు మృతి 

రైతు సంఘాల ఆగ్రహం 

సాక్షి, చెన్నై: ఓ జాతీయ బ్యాంక్‌ అధికారి తీరుకు నిండు ప్రాణం బలైంది. తండ్రి చేసిన అప్పు కోసం తన ఖాతాను అధికారులు స్తంభింపజేశారు. దీంతో వైద్యం ఖర్చులకు నగదు కరువై అతను ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఆదివారం తిరుప్పూర్‌ జిల్లా పల్లడంలో వెలుగు చూసింది. పొంగలూరు కులం పాళయంకు చెందిన కనకరాజ్‌ రైతు. అతనికి భార్య కవిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండు నెలల క్రితం అతని బ్యాంక్‌ ఖాతాను ఎస్‌బీఐ అధికారులు స్తంభింపజేశారు. కనకరాజ్‌ బ్యాంక్‌ అధికారులను సంప్రదించగా అసలు విషయం తెలిసింది. అదే బ్యాంక్‌లో కనకరాజ్‌ తండ్రి రంగస్వామికి సైతం ఖాతా ఉంది. 2017లో ఆయన అనారోగ్యంతో మరణించడంతో బ్యాంక్‌లో తీసుకున్న పంట రుణం రూ.75 వేలు బకాయి ఉంది.

ఆ మొత్తాన్ని చెల్లించాలని కనకరాజ్‌ మీద ఒత్తిడి తెస్తూ ఖాతాను స్తంభింప చేసినట్టు తేలింది. రంగస్వామికి మరో కుమారుడు నారాయణ స్వామి ఉన్నా, అతడిని వదలి పెట్టి తన మీద మాత్రం బ్యాంకర్లు ఒత్తిడి తీసుకురావడంతో అప్పు చెల్లించేది లేదని కనకరాజ్‌ తేల్చాడు. కొద్ది రోజుల క్రితం కనకరాజ్‌ హఠాత్తుగా కిడ్నీ సంబంధిత వ్యాధి బారిన పడ్డాడు. చికిత్సకు రూ.లక్ష చెల్లించాలని కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు సూచించాయి. దీంతో కనకరాజ్‌ ఖాతాలో ఉన్న నగదును తీసుకునేందుకు కుటుంబ సభ్యులు తీవ్రంగానే ప్రయత్నించారు. రంగస్వామి తీసుకున్న అప్పు చెల్లిస్తేనే కనకరాజ్‌ ఖాతాను తిరిగి పనిచేసేలా చేస్తామని బ్యాంక్‌ మేనేజర్‌ సుందరమూర్తి పేర్కొన్నారు. ఖాతాలో రూ.1.5 లక్షల నగదు ఉన్నా తీసుకునేందుకు వీలుకాకపోవడంతో వైద్యం అందలేదు.

దీంతో కనకరాజ్‌ శనివారం మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం చెందాయి. నేతలు ఆదివారం కనకరాజ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. సంబంధిత బ్యాంక్‌ అధికారిపై చర్యలు తీసుకోవాలని, బ్యాంక్‌ ద్వారా ఆ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించడమే కాకుండా, రంగస్వామి తీసుకున్న రుణాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంగా ఆ బ్యాంక్‌ మేనేజర్‌ సుందరమూర్తిని మీడియా ప్రశ్నించగా వైద్య ఖర్చుల కోసం అడగ్గానే ఖాతా మళ్లీ పనిచేసేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఏటీఎం నుంచి నగదు రాకపోతే దానికి తాను బాధ్యడిని ఎలా అవుతానని సమాధానం ఇవ్వడం గమనార్హం.
చదవండి: విటమిన్‌ పేరిట విషం.. ముగ్గురి హత్య

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top