140 ఎకరాల భూమిపై ధర్మారెడ్డి కన్ను

Ex Tahsildar Nagaraju Help To Kandadi Dharma Reddy Lands - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కీసర నాగరాజు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. రూ.కోటీ పది లక్షల లంచం తీసుకుంటూ దొరకడం జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు స్థానికులు, రియల్టర్లతో కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. కీసర తహసీల్దార్‌గా ఉన్న సమయంలో నాగరాజు రాంపల్లికి చెందిన కందాడి ధర్మారెడ్డి పేరిట, తన స్నేహితులు, బంధువుల పేరిట రెండెకరాలకుపైగా భూమిని దక్కించుకున్నాడు. ఈ భూములతోపాటు మొత్తం 24 ఎకరాల భూములకు నకిలీపత్రాల సాయంతో పాసుబుక్కులు జారీ చేసిన నాగరాజును రెండోసారి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టిన ఏసీబీకి నాగరాజు అక్రమాలకు సంబంధించిన అనేక ఆధారాలు లభిస్తున్నాయని తెలిసింది. 

అనేక భూ సెటిల్‌మెంట్లు..
స్థానికంగా పలుకుబడి కలిగిన కందాడి ధర్మారెడ్డితో కలిసి నాగరాజు అనేక భూ సెటిల్‌మెంట్లు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. గ్రామపరిధిలో ఉన్న 140 ఎకరాలను ధర్మారెడ్డి కాజేద్దామని ప్రయత్నించిన సమయంలోనూ నాగరాజు సహాయసహకారాలు అందించినట్లు సమాచారం. సర్వే నంబరు 621, 639లలో 140 ఎకరాల వివాదాస్పద భూమి ఉంది. దీనిపై కన్నేసిన ధర్మారెడ్డి దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని 24 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. 1996లో ఆ భూమి తనదే అంటూ ప్రొటెక్ట్‌ టెనెంట్‌ (పీటీ) పత్రాలను సృష్టించాడు. దీనిపై సుమారు 20 మంది స్థానికులు అభ్యంతరం తెలిపారు. 1958లో తాము కిషన్‌సేఠ్ అనే వ్యక్తి వద్ద భూమిని కొనుగోలు చేశానంటూ నకిలీపత్రాలను అప్పటి ఎమ్మార్వోకు సమర్పించారు. అయితే, అప్పుడు తన పాచిక పారలేదు.

కీసరకు నాగరాజు తహసీల్దార్‌గా రాగానే మళ్లీ పైరవీ మొదలుపెట్టాడు. ఈ మేరకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ విషయాలన్నీ ప్రస్తుత ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయని తెలిసింది. ఇటీవల 24 ఎకరాలకు అక్రమంగా పాసుబుక్కులు జారీ చేయడంపైన స్థానికులు ఫిర్యాదు చేయడంతో నాగరాజు, ధర్మారెడ్డితోపాటు అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ వెంకటేశ్, రియల్టర్లు వెంకటేశ్వర్‌రావు, జగదీశ్వరరావు, భాస్కర్‌రావులను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ 24 ఎకరాల భూమి విలువ రూ.48 కోట్లకుపైనే ఉంటుందని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 14న పట్టుబడిన సమయంలోనూ దాదాపు 53 ఎకరాలను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top