కిరణ్‌రాజు, అర్జున్‌పై ‘లుక్‌ఔట్‌’?

Drugs Case: HYD Police May Look Out Notice On Kiran Raj And Arjun - Sakshi

విదేశాలకు పారిపోకుండా పోలీసుల చర్యలు 

పబ్‌ భాగస్వామి అభిషేక్, మేనేజర్‌ అనిల్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు 

‘పుడింగ్‌ అండ్‌ మింక్‌’  రేవ్‌ పార్టీ కేసు దర్యాప్తు ముమ్మరం 

సాక్షి, హైదరాబాద్‌: రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ అధీనంలోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో జరిగిన రేవ్‌ పార్టీ కేసులో నిందితులుగా ఉన్న పబ్‌ భాగస్వాములు పెనుమత్స కిరణ్‌ రాజు, అర్జున్‌ వీరమాచినేనిపై లుక్‌ఔట్‌ సర్క్యులర్స్‌(ఎల్‌వోసీ) జారీ చేయాలని హైదరాబాద్‌ సిటీ పోలీసులు యోచిస్తున్నారు. పరారీలో ఉన్న వీరిద్దరు దేశం విడిచిపోకుండా అడ్డుకునేందుకే పోలీసులు ఈ ఎల్‌వోసీ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే కిరణ్‌ రాజు పాస్‌పోర్ట్‌ వివరాలను సేకరించారు. అర్జున్‌ పాస్‌పోర్టు వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. గురువారం సాయంత్రానికి రాష్ట్ర నోడల్‌ అధికారుల ద్వారా దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు ఎల్‌వోసీలు పంపడానికి చర్యలు ముమ్మరం చేశారు.

ఈ చర్యలు పూర్తయితే బంజారాహిల్స్‌ ఠాణాలో ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద నమోదైన కేసులో వీరిద్దరు కూడా నిందితులనే విషయం ఇమిగ్రేషన్‌ డేటాబేస్‌లోకి చేరుతుంది. ఈ క్రమంలో వీరు దేశం దాటి వెళ్లడానికి ప్రయత్నిస్తే, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు గుర్తిం చి అదుపులోకి తీసుకుంటారు. వీరిద్దరూ రాష్ట్రం వెలుపల ఉన్నారని భావిస్తున్న పోలీసులు పట్టుకో వడం కోసం సాంకేతికంగానూ ముందుకు వెళ్తున్నారు.

ఇప్పటికే అధికారులు పబ్‌ ఉద్యోగులను ప్రశ్నించారు. రేవ్‌ పార్టీ జరిగిన రోజే పబ్‌లో ఓ ప్రముఖుడి కుమారుడి పుట్టినరోజు వేడుక జరిగిందని విచారణలో బయటపడింది. ఆ ‘మూడు టేబుళ్ల’వద్దే డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి వద్ద కూర్చున్నవారిని గుర్తించడానికి మరోసారి సీసీ కెమెరాల ఫుటేజ్‌ని విశ్లేషిస్తున్నారు. 

నేడు ఎంఎస్‌జే కోర్టులో కస్టడీ పిటిషన్‌పై విచారణ 
ఇప్పటికే అరెస్టు అయి, జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న పబ్‌ భాగస్వామి అభిషేక్‌ ఉప్పాలతోపాటు మేనేజర్‌ అనిల్‌కుమార్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిగే అవకాశముంది. ఈ కోర్టులోనే బుధవారం ఈ నిందితులిద్దరు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

అయితే ఈ పిటిషన్లను కొట్టేయాలంటూ బంజారాహిల్స్‌ పోలీసులు కౌంటర్లు సైతం సమర్పిస్తున్నారు. కిరణ్‌ రాజు డైరెక్టర్‌గా ఉన్న టి-డిజైన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు అనుబంధంగా పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కొనసాగుతోంది. దీనితోపాటు మరో 24 సంస్థల్లోనూ కిరణ్‌ డైరెక్టర్‌గా ఉన్నట్లు పోలీసు లు గుర్తించారు.

ఆదివారం ఆ పబ్‌పై దాడి చేసిన సందర్భంలో నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, బిగ్‌బాస్‌ విన్నర్, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కొడుకు గల్లా సిద్ధార్ధ్‌తోపాటు మాజీ కేంద్రమంత్రి మనవడు సహా 128 మంది కస్టమర్లు, 18 మంది సిబ్బంది, అభిషేక్, అనిల్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. వీరిలో అభిషేక్, అనిల్‌కుమార్‌లను అరెస్టు చేయగా, మిగిలిన వారిని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టిన విషయం తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top