ఫోర్‌ట్వంటీ.. నకిలీ ‘గ్యారంటీ’..

Cyberabad Police Busts Bank Guarantee Fraud Arrests MD Of Company - Sakshi

నకిలీ పత్రాలతో బ్యాంకుకు 53 కోట్లు టోకరా 

ఇద్దరిని అరెస్ట్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసులు 

పరారీలో మరో ఇద్దరు నిందితులు

సాక్షి, హైదరాబాద్‌: తప్పుడు పత్రాలతో జాతీయ బ్యాంక్‌ను మోసం ఘటన చేసిన నగరంలో వెలుగుచూసింది. నకిలీ బ్యాంక్‌ గ్యారంటీలు సమర్పించి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)కు రూ.53 కోట్లు టోకరా వేసిన ఇద్దరు ఘరానా నిందితులను సైబరాబాద్‌ ఎకనామిక్‌ ఆఫెన్స్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్ట్‌ చేశారు. సనత్‌నగర్‌కు చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ కట్టమీది సంతోష్‌ రెడ్డి (36) కంపాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేరిట 2010 ఏప్రిల్‌లో కంపెనీని ఏర్పాటు చేశాడు.

ఇందులో కేపీహెచ్‌బీకి చెందిన నెక్కంటి శ్రీనివాస్‌ (51), మాదాపూర్‌ సాయినగర్‌కు చెందిన కొండకల్‌ గోపాల్‌ (42), నెల్లూరు జిల్లా వేదాయపాలెంకు చెందిన సోమవరపు సురేందర్‌ రెడ్డి (52) డైరెక్టర్లుగా చేరారు. వివిధ కంపెనీ సప్లయర్ల నుంచి మెటీరియల్‌ సేకరణ కోసం యూబీఐ నుంచి బ్యాంక్‌ గ్యారంటీ పొందాడు.

దీని ఆధారంగా హెల్లా ఇన్‌ఫ్రా మార్కెట్‌ లిమిటెడ్, హెచ్‌పీసీఎల్, ఇన్ఫినిటీ ప్రాజెక్ట్స్, సృజన ఇండస్ట్రీస్, ఎన్‌ఎస్‌ఐసీ లిమిటెడ్, ఓఎఫ్‌బీ టెక్, పవర్‌2ఎస్‌ఎంఈ, జెట్‌వెర్క్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలు సంతోష్‌ రెడ్డికి మెటీరియల్‌ సరఫరా చేశాయి. 

నకిలీ గ్యారంటీ సమర్పణ 
సాధారణంగా బ్యాంక్‌ గ్యారంటీ పొందాలంటే కంపెనీలోని ఒక డైరెక్టర్‌ ఆస్తులను సెక్యూరిటీగా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ పరిమితి దాటితే అప్పటికే ఉన్న గ్యారంటీని క్లోజ్‌ చేయాలి లేదా దాని స్థానంలో గ్యారంటీని పునరుద్ధరించాలి. అయితే ఈ కేసులో సంతోష్‌ రెడ్డి గరిష్ట గ్యారంటీ పరిమితి రూ.15 కోట్లు ఉండగా.. ఆ పరిమితిని మించి వివిధ కంపెనీల నుంచి మెటీరియల్‌ పొందేందుకు నకిలీ పత్రాలను సృష్టించాడు.

వీటిని సంబంధిత కంపెనీలకు సమర్పించాడు. అలాగే కొత్త బ్యాంక్‌ గ్యారంటీని పొందేందుకు అప్పటికే గ్యారంటీ సమర్పించిన కంపెనీల లెటర్లను ఫోర్జరీ చేసి బ్యాంక్‌లకు సమర్పించాడు. ఇలా కంపాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ యూబీఐ కొండాపూర్‌ బ్రాంచ్‌లో 39 బ్యాంక్‌ గ్యారంటీలు సమర్పించి 53,18,50,093 రూపాయలు మోసం చేసింది. 

నకిలీని గుర్తించి..
నకిలీ గ్యారంటీ పత్రాలను గుర్తించిన యూబీఐ బ్యాంక్‌ ఏజీఎం సరిగాల ప్రకాశ్‌ బాబు గత జూలై 8న మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంపాస్‌ ఇన్‌ఫ్రా, నలుగురు డైరెక్టర్లపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధాన నిందితుడు సంతోష్‌ రెడ్డి విదేశాలకు పరారయ్యాడు.

ఈఓడబ్ల్యూ బృందం నిందితుడి కదలికలపై నిఘా ఉంచింది. సాంకేతిక ఆధారాలను సేకరించి, విశ్వసనీయ సమాచారం మేరకు జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ గెస్ట్‌ హౌస్‌లో సంతోష్‌ రెడ్డి, శ్రీనివాస్‌లను శుక్రవారం అదుపులోకి తీసుకుంది. మరో ఇద్దరు నిందితులు గోపాల్, సురేందర్‌ రెడ్డి పరారీలో ఉన్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top