ఆ ఉచ్చులో పడితే అంతే.. చైనాలో సూత్రధారులు.. ఉత్తరాదిలో పాత్రధారులు

Cyber Criminals Cheating People In The Name Of Social Media Likes - Sakshi

మాజీ సైనికోద్యోగి నుంచి 21 లక్షలు.. పదవీ విరమణ చేసిన ప్రైవేట్‌ ఉద్యోగి నుంచి రూ.53 లక్షలు..  ఓ వ్యాపారి నుంచి రూ.48 లక్షలు.. కేవలం గత మూడు రోజుల్లో పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ పేరిట సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము ఇది. కేవలం లైకులు కొడితే చాలంటూ.. ఇంటి నుంచే పనిచేస్తూ సంపాదించుకోవచ్చంటూ.. గాలం వేసి డబ్బులు కాజేస్తున్న ఈ తరహా నేరాలు బాగా పెరిగాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌లు అంటూ వచ్చే మెసేజీలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

చిన్న సందేశంతో మొదలై..
పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు ఉన్నాయని.. స్మార్ట్‌ ఫోన్, ఇంటర్‌నెట్‌ ఉంటే చాలు ఇంటి నుంచే సంపాదించవచ్చంటూ సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ సందేశాలు, ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారు. వ్యవస్థీకృతంగా పనిచేసే ఈ ముఠాలు వర్చువల్‌ నంబర్లతోపాటు నకిలీ గుర్తింపుకార్డులతో తీసుకున్న ఫోన్‌ నంబర్లతో ఈ వ్యవహారాన్ని నడిపిస్తాయి. ఆ సందేశాల్లో ఉన్న లింకులను క్లిక్‌ చేస్తే వాట్సాప్, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా సైట్స్‌లోని గ్రూపులు తెరుచుకుంటాయి. అక్కడ ఈ పార్ట్‌టైమ్‌ జాబ్‌ల వివరాలు ఉంటాయి. కేవలం లైకులు కొడితే చాలు డబ్బులు వస్తాయని.. తనకు నెల రోజుల్లోనే రూ.లక్షల్లో సొమ్ము వచ్చిందని.. ఇందులో చేరితే బాగుంటుందని.. ఇలా ఆ గ్రూపుల్లో చర్చలు జరుగుతుంటాయి. ఇలా కామెంట్స్‌ చేసే వారంతా ఆ సైబర్‌ క్రైమ్‌ ముఠా వారే ఉంటారు. అవి చూసిన అమాయకులు ఆశతో ముందడుగు వేస్తారు.

యాప్స్, వాలెట్స్‌లో డబ్బులు జమ చేయించి..
సైబర్‌ నేరగాళ్లు తాము టార్గెట్‌ చేసిన వ్యక్తితో వాట్సాప్, టెలిగ్రామ్‌ ద్వారా సంప్రదింపులు జరుపుతూ.. ప్రత్యేక యాప్స్, వెబ్‌సైట్లకు చెందిన లింకులను పంపుతారు. వాటిలో వివరాలు నమోదు చేసి రిజిస్టర్‌ చేసుకోవాలని కోరుతారు. అందులో ఉండే వివిధ స్కీముల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుని.. దానికి అనుగుణంగా నెట్‌ బ్యాంకింగ్‌ లేదా యూపీఐ విధానంలో డబ్బులు పెట్టుబడి పెట్టాలని సూచిస్తారు. స్కీమ్‌ ఎంపిక చేసుకుని, డబ్బులను అందులో జమ చేశాక.. వరుసగా వీడియోలు వస్తుంటాయి. వాటిని లైక్‌ చేస్తూ పోవాలని, ప్రతి లైక్‌కు రూ.2 నుంచి రూ.5 వరకు వస్తాయని చెబుతారు. ఇలా లైకులు చేసే కొద్దీ అందుకు సంబంధించిన సొమ్ము బాధితుడి వర్చువల్‌ ఖాతాలోకి జమ అవుతూ ఉంటాయి.

చిన్న మొత్తాలు ఇచ్చి.. పెద్ద మొత్తానికి గాలమేసి..
బాధితులు జమ చేసిన మొత్తం, లైకుల ద్వారా సంపాదించిన సొమ్ము వారి వర్చువల్‌ ఖాతాలోనే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల్లోనే సొమ్ము బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇందులో కొంతమొత్తం సొమ్మును ఒకట్రెండు సార్లు బ్యాంకు ఖాతాలోకి మార్చుకుని, డ్రా చేసుకోవడానికీ అవకాశమిస్తారు. ఇలా పూర్తిగా నమ్మించి.. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ వీడియోలను లైక్‌ చేసే అవకాశం వస్తుందని.. ఎక్కువ లాభం వస్తుందని గాలం వేస్తారు. దీంతో కొందరు బాధితులు లక్షల్లో సొమ్మును యాప్స్‌/వాలెట్లలోకి జమ చేస్తారు. వీడియోలు లైక్‌ చేసిన కొద్దీ వచ్చే సొమ్ము వారి వర్చువల్‌ ఖాతాలో కనిపిస్తుంటుంది. ఇక్కడే మరింత మోసం మొదలవుతుంది. వర్చువల్‌ ఖాతాల్లో భారీగా సొమ్ము కనిపించినా.. బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం ఇవ్వరు.

అలా డ్రా చేసుకోవాలంటే, రూల్‌ ప్రకారం మరింత మొత్తం పెట్టుబడి పెట్టాలంటూ.. బాధితులతో వీలైనంత మేర జమ చేయిస్తారు. ఆ సొమ్మంతా సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయినట్టే. తర్వాత ఆ యాప్‌/ వెబ్‌సైట్‌ మాయమైపోతాయి. తమ ఫోన్‌కు వచ్చిన లింకులు, వెబ్‌ అడ్రస్‌ల ద్వారా తెరవడానికి ప్రయత్నించినా.. సదరు యాప్స్‌/వెబ్‌సైట్లు అందుబాటులో లేవని చూపిస్తుంది. 

ఇలాంటి సైబర్‌ గ్యాంగులు దేశవ్యాప్తంగా అమాయకులకు గాలం వేసి వందల కోట్ల రూపాయలు కాజేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు, రాజస్తాన్, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఎక్కువగా పంజా విసరుతున్నాయి. లైకులు, ఇన్వెస్ట్‌మెంట్స్, సేల్స్‌ పేరుతో జరిగే ఈ స్కామ్స్‌కు చైనీయులే సూత్రధారులని.. ఉత్తరాది రాష్ట్రాల వారి సాయంతో ఈ నేరాలకు పాల్పడుతున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. కేవలం లైకులు, షేర్‌లు చేయడం వల్ల డబ్బు రాదని.. తెలియని అంశాల్లో పెట్టుబడులు వద్దని సూచిస్తున్నారు.
చదవండి:ఒకటి, రెండు కాదు.. 40 బైకులు సీజ్: కారణం ఏంటంటే?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top