కర్నూలులో భక్షక భటుడి లీలలు.. క్రైంపార్టీ ముసుగులో..

Constable Illegal Collection In Kurnool - Sakshi

సెటిల్‌మెంట్‌ కానిస్టేబుల్‌  

ఆ స్టేషన్‌ కేసులన్నీ అతని కనుసన్నల్లోనే..  

కర్నూలు:  పోలీసు శాఖలో ప్రక్షాళన దిశగా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఓ వైపు చర్యలు తీసుకుంటుంటే.. అవేవి పట్టనట్టు కర్నూలు నాలుగో పట్టణ స్టేషన్‌లో కొందరు సిబ్బంది యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎస్పీ హెచ్చరికలు ఆ స్టేషన్‌ అధికారులు, సిబ్బందికి తలకెక్కినట్లు లేవు. స్టేషన్‌లో సుమారు 70 మంది దాకా సిబ్బంది ఉన్నారు. కీలక వ్యవహారాలన్నీ క్రైం పార్టీ కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయనే విమర్శలున్నాయి. నలుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు క్రైంపార్టీ ముసుగులో వసూళ్ల దందా సాగిస్తున్నారు. వీరిపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ వారిని ఇతర విధులకు కేటాయించకుండా స్టేషన్‌కు వచ్చే బాధితులతో సెటిల్‌మెంట్లు చేసే బాధ్యతలను అధికారులే అప్పగిస్తున్నారని తెలుస్తోంది.

చోరీలు నియంత్రించడం, హత్యలు, అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడం వంటి ప్రధాన విధులు పక్కనపెట్టి వసూళ్ల కార్యక్రమమే వీరి దిన చర్యగా మారింది. వీరిలో ఓ కానిస్టేబుల్‌ అన్నీతానై సెటిల్‌మెంట్‌ దందా కొనసాగిస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్‌ మెట్లు ఎక్కే ప్రతి ఫిర్యాదుదారుని నుంచి ఏదో ఒక రూపంలో మామూళ్లు వసూలు చేయడంలో అతను సిద్ధహస్తుడిగా సిబ్బంది బహిరంగగానే చెబుతున్నారు. పాత నేరస్తులు, జేబు దొంగలు, రౌడీషీటర్లతో పరిచయాలు పెట్టుకుని దందా నడిపిస్తున్నారు. స్టేషన్‌కు కూత వేటు దూరంలోని ఓ లాడ్జినే ఇందుకు అడ్డాగా మార్చుకున్నారు. ప్రధానంగా ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు, ఎస్పీ కార్యాలయంలోని సెంట్రల్‌ కంప్లయిట్‌ సెల్‌ (సీసీసీ) నుంచి వచ్చే ఫిర్యాదుదారుల వద్ద భారీగా పిండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

భక్షక భటుడి లీలలు ఇవే..
►కర్నూలు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో కొత్తబస్టాండ్, మార్కెట్‌ యార్డు, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్, ఈద్గా తదితర ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. ఇక్కడ తరచూ జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తారు.
►బాధితులు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగానే దొంగలను పట్టుకురావడం.. సగం మాత్రమే రికవరీ అయ్యిందని, మిగతా సగం నొక్కేయడం పరిపాటిగా మారింది.  
►చోరీకి గురైన సెల్‌ఫోన్లను రికవరీ చేసినప్పుడు బాధితుల నుంచి సెల్‌ఫోన్‌ ఖరీదును బట్టి రూ.3 వేల నుంచి రూ.5వేల దాకా వసూలు చేస్తున్నారు.  
►నెల రోజుల క్రితం ఆ కానిస్టేబుల్‌ ఇంట్లో జరిగిన ఓ వేడుకకు షరీన్‌ నగర్‌కు చెందిన కొంతమంది జేబు దొంగలు హాజరై కార్యక్రమాన్ని నడిపించినట్లు చర్చ జరుగుతోంది.  
►ఆటోల్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ సమయంలో భారీగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.  
►స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి కూడా కేసు తీవ్రతను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 50 వేల దాకా వసూలు చేస్తున్నారు.  
►ఇంటి నుంచి వెళ్లి పోయిన ప్రేమ జంటలో యువతి మైనర్‌ అయితే పొక్సో కేసు పెడతామంటూ ఇటీవల ఇద్దరు యువకులను బెదిరించి భారీగా డబ్బు దండుకున్నారు.   
►మద్యం తరలిస్తూ చెక్‌పోస్టు వద్ద  పట్టుబడిన కేసులో సస్పెండ్‌ అయిన ఓ కానిస్టేబుల్‌కు అధికారి అండతో ఇదే స్టేషన్‌లో పోస్టింగ్‌ వేయించుకుని ఇద్దరూ వసూళ్ల దందా నిర్వహిస్తున్నట్లు తెలిసింది.   
►స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ఫ్యాక్టరీలో కొంతకాలం క్రితం చోరీ జరిగింది. జెడ్చర్లలో ఉన్న రెండు వాహనాలను నేరానికి ఉపయోగించినట్లు గుర్తించి పట్టుకొచ్చి అందులో ఒక వాహనాన్ని వదిలేసేందుకు భారీగా ముడుపులు వసూలు చేసినట్లు విమర్శలున్నాయి.
►కుటుంబ తగాదాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి న్యాయం కోసం ఈ స్టేషన్‌ కు వెళ్తే సాయం పేరుతో క్రైంపార్టీ సిబ్బంది తలదూర్చి సెటిల్‌మెంట్ల వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఇటీవల ఓ కాలనీకి చెందిన ఇరువర్గాలు గొడవ పడి స్టేషన్‌కు వెళ్తే భారీగా వసూలు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top