గేమ్‌ పేరుతో రూ.1,100 కోట్లు నొక్కేసిన చైనా కంపెనీలు

China Companies Looted Huge Amount Under Colour Prediction Game Hyderabad - Sakshi

ఆరు కంపెనీల ద్వారా హాంకాంగ్‌కు పంపిన చైనీయులు 

ఇక్కడి వారి నుంచి ‘కలర్‌ ప్రెడిక్షన్‌’లో స్వాహా 

షెల్‌ కంపెనీల పేరుతో ఆరు బ్యాంకు ఖాతాలు 

నకిలీ వే బిల్లులు సృష్టించి నగదు మళ్లింపు 

సాక్షి, హైదరాబాద్‌: గేమ్‌ ఆఫ్‌ చాన్స్‌గా పరిగణించే ‘కలర్‌ ప్రెడిక్షన్‌’ను ఆన్‌లైన్‌లో నిర్వహించిన చైనా కంపెనీలు ఇక్కడివారి నుంచి కాజేసిన మొత్తంలో రూ.1,100 కోట్లు హాంకాంగ్‌కు తరలించేశాయి. ఢిల్లీలో షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి, వాటి పేర్లతో ముంబైలో బ్యాంకు ఖాతాలను తెరిచిన కేటుగాళ్లు నకిలీ ఎయిర్‌ వే బిల్లుల సహకారంతో ఈ పని పూర్తి చేశారు. 2020లో ఈ కలర్‌ ప్రిడెక్షన్‌ గుట్టురట్టు చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. కేసులు నమోదు చేసి చైనీయులు సహా ఉత్తరాదికి చెందిన పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసుల ఆధారంగా ముందుకు వెళ్లిన  ఈడీ మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేసింది. దీంతో నకిలీ ఎయిర్‌ వే బిల్లుల విషయం బయటపడింది. మోసానికి సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే అధికారం ఈడీకి లేకపోవడంతో హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈడీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ బి.రవీందర్‌రెడ్డి లోతుగా దర్యాప్తు చేయడంతో రూ.1,100 కోట్లు దేశం దాటినట్లు తేలింది.  

ఈ–కామర్స్‌ కంపెనీల పేరుతో... 
భారత్‌లో కలర్‌ ప్రెడిక్షన్‌ (రంగు సెలక్షన్‌ ప్రక్రియతో కూడిన జూదం) దందా నడపాలని నిర్ణయించుకున్న చైనీయులు ఢిల్లీ, ముంబైకి చెందిన కొందరితో కలిసి పథకం ప్రకారం వ్యవహరించారు. లింక్‌యున్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, డోకీపే టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, స్పాట్‌పే టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సంస్థల్ని ఏర్పాటు చేశారు. ఈ–కామర్స్‌ వ్యాపారం పేరుతో వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్‌ చేశారు. వీటి ముసుగులోనే ఆన్‌లైన్‌ గేమ్‌ కలర్‌ ప్రిడెక్షన్‌ను నిర్వహించారు. ఆ 3 సంస్థల పేరుతోనే పేమెంట్‌ గేట్‌వేస్‌ అయిన కాష్‌ ఫ్రీ, పేటీఎం, రేజర్‌ పే, ఫోన్‌ పే, గూగుల్‌ పేలతో ఒప్పందాలు చేసుకున్నారు. సోషల్‌మీడియా ద్వారా సర్క్యులేట్‌ అయిన ఈ గేమ్‌ హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా యువతను నిండా ముంచింది.   

పేమెంట్‌ గేట్‌వేల నుంచి..
ఈ గేమ్‌ ఆడేవాళ్లు ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఈ పేమెంట్‌ గేట్‌వేల ద్వారానే చేపట్టారు. వీటి ద్వారా గేమ్‌ ఆడినవాళ్ల నుంచి దోచుకున్న సొమ్మును లింక్‌యున్, డోకీపే, స్పాట్‌పే ఖాతాల్లోకి మళ్లించారు. ఈ సంస్థల నుంచి సొమ్ము మళ్లించడానికి ఢిల్లీలో గ్రేట్‌ ట్రాన్స్‌ ఇంటర్నేషనల్, ఏషియా పసిఫిక్‌ కార్గో కంపెనీ,  రేడియంట్‌ స్పార్క్‌ టెక్నాలజీస్, ఆర్చీవర్స్‌ బిజ్‌ ఇంటర్నేషనల్, కనెక్టింగ్‌ వరల్డ్‌ వైడ్, జెనెక్స్‌ షిప్పింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్లతో షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేశారు. వీటికి ముంబైలో బ్రాంచ్‌లు ఉన్నట్లు పత్రాలు సృష్టించి వెస్ట్‌ ముంబై జోగీశ్వరి ప్రాంతంలోని ఎస్‌బీఐ, ముంబైలోని నారీమన్‌ పాయింట్‌లో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మారిషస్‌ రహేజా సెంటర్‌లో 6 ఖాతాలు తెరిచి సొమ్ము తరలించారు. ఈ ప్రకియంతా నకిలీ పత్రాలతోనే నడిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top