పోలీసు ఇంటికే కన్నం

The Burglary Took Place At A Police Home - Sakshi

మీర్‌పేట: ఓ పోలీసు ఇంటికి కన్నం వేసిన దొంగలు 35 తులాల బంగారు ఆభరణాలు, రూ.17లక్షల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా, మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడ, విజయపురికాలనీకి చెందిన ముడావత్‌ శంకర్‌ ఛత్రినాక పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి భార్య లక్ష్మి ఈ నెల 27న బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది.

గురువారం ఉదయం శంకర్‌ ఉదయం డ్యూటీకి వెళ్లాడు. అతడి కుమార్తె, కుమారుడు కాలేజీకి వెళ్లారు. మధ్యాహ్నం  శంకర్‌ తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాల్లోని వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కుమార్తె వివాహం కోసం దాచిన 35తులాల బంగారు ఆభరణాలు, రూ.17 లక్షల నగదు కనిపించలేదు.

దొంగతనం జరిగినట్లు గుర్తించిన శంకర్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. సంఘటనా స్థలాన్ని ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పరిశీలించారు. 

చోరీపై అనుమానాలు...? 
ఆభరణాలు, నగలు ఉంచిన బీరువాలకు తాళాలు వేసి ఉండకపోవడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలిసిన వారి పనై ఉంటుందని, పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు.  

(చదవండి: పోలీస్‌ కొలువుకు మూడు టెక్నిక్‌లు.. పర్ఫెక్ట్, నాలెడ్జ్, స్మార్ట్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top