అర్నబ్‌ కేసు: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Arnab Goswami Bail Plea Hearing Power To Re Investigate Wrongly Used - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామి సుప్రీం తలుపు తట్టారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్‌‌ తిరస్కరణనూ ఆయన సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. అర్నబ్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపిస్తూ.. ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తు చట్ట విరుద్ధంగా సాగుతోందని అన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల బెంచ్ స్పందిస్తూ.. ‘టీవీ చానెల్స్‌ అరుపులను ప్రభుత్వాలు పట్టించుకుంటే ఎలా? రిపబ్లిక్‌ టీవీలో అతని అరుపులపై మీ ఎన్నికల భవిష్యత్‌ ఆధారపడిందా? మేం ఆ టీవీ చూడం.. కానీ, మహారాష్ట్ర సర్కార్‌ చేసింది సరైనదిగా అనిపించడం లేదు. వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి దూస్తే మేమున్నామని గుర్తుంచుకోండి’అని సుప్రీం బెంచ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, సదరు జర్నలిస్టుపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను‌ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మాత్రమే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. 

అర్నబ్‌ తరపు న్యాయవాది సాల్వే మాట్లాడుతూ.. తమ కేసు ఎఫ్‌ఐఆర్‌ దశ దాటిపోయిందని, దర్వాప్తు జరిగిన తర్వాతే మే, 2018లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు తెలిపారు. ఇక ఈ కేసు పునర్‌ దర్వాప్తు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారం దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, ఈ కేసులో  గత బుధవారం అరెస్టై జైలులో ఉన్న అర్నబ్‌కు నవంబర్‌ 18 వరకు రాయిగఢ్‌ జిల్లా కోర్టు జ్యుడిషియల్‌ కస్టడి విధించింది. ఇక మధ్యంతర బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను  బాంబే హైకోర్టు  తిరస్కరించిన విషయం తెలిసిందే. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసును మళ్లీ తవ్వారనేది అర్నాబ్‌ గోస్వామి వాదన. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top