నిత్య పెళ్లికొడుకు సతీష్‌ తెలుగుతమ్ముడే!

AP Software Engineer Accused Of Marrying 5 Women TDP Leader - Sakshi

అమెరికాలో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సమావేశానికి హాజరైన కర్నాటి సతీష్‌

అంతేకాకుండా కీలకపాత్ర అతడిదే..

మరోవైపు అదనపు ఎస్పీకి మోసపోయిన మహిళల ఫిర్యాదు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: నిత్య పెళ్లికొడుకుగా మారి ఇప్పటివరకు ఐదు పెళ్లిళ్లు చేసుకుని మరికొంతమందిని మోసం చేసిన కర్నాటి సతీష్‌ బాబు టీడీపీ నేతేనని వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికాలోని వర్జీనియాలో జరిగిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం సమావేశానికి సతీష్‌ హాజరవడమే కాకుండా కీలకంగా వ్యవహరించాడని చెబుతున్నారు. ఆ సమావేశంలో టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి పాల్గొన్నారు. టీడీపీలో తనకు ఉన్న పరిచయాలతో ఇక్కడ చక్రం తిప్పాడని బాధితులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందకూరుకు చెందిన కర్నాటి వీరభద్రరావు కుమారుడు కర్నాటి సతీష్‌ మోసం చేసి పలువురు మహిళలను పెళ్లి చేసుకున్నట్లు ఒక మహిళ దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని ఈ నెల 26న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 

పసరు మందు ఇచ్చి అబార్షన్‌..
ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో నాలుగో భార్యకు పసరు మందు ఇచ్చి అసహజ పద్ధతుల్లో సతీష్‌ బాబు అబార్షన్‌ చేయించాడు. ఐదో భార్యను కూడా అబ్బాయిని కనడం కోసమే చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. శనివారం సతీష్‌ చేతిలో మోసపోయిన నాలుగో భార్య, ఐదో భార్య గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ, దిశ ఇన్‌చార్జ్‌ సుప్రజను కలిసి ఫిర్యాదు చేశారు. సతీష్‌కు ఉన్న ఐదు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను సీజ్‌ చేసి అందులో ఉన్న నీలిచిత్రాలను తొలగించాలని నాలుగో భార్య కోరారు. తనకు, తన తల్లికి ఆ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు విడాకులు ఇవ్వకుంటే తనతో పడకగదిలో ఉన్నప్పుడు రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఐదో భార్య కూడా సతీష్‌ విదేశాలకు పారిపోకుండా అతడి పాస్‌పోర్టును సీజ్‌ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం కస్టడీ పిటీషన్‌ వేయనున్నట్లు ఏఎస్పీ సుప్రజ తెలిపారు. ఇంకా అతడి వల్ల మోసపోయిన మహిళలు ఉంటే నేరుగా అధికారులను కలిసి వివరాలు అందజేయాలన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top