
ప్రతీకాత్మక చిత్రం
భర్త తరచూ కొట్టేవాడన్నారు. తాజాగా చంపుతానని బెదిరిస్తున్నాడని వాపోయారు
అనంతపురం: ‘నన్ను, నా పిల్లల్ని నరికిపారేస్తానని భర్త బెదిరిస్తున్నాడు. అతని నుంచి మాకు ప్రాణహాని ఉంది’ అంటూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పకు జిల్లా జైలు హోంగార్డు నీలిమ ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని ఎస్పీ చేపట్టారు. వివిధ సమస్యలపై 153 అర్జీలు అందాయి. తన సమస్యను ఎస్పీ దృష్టికి హోంగార్డు నీలిమ అర్జీ రూపంలో తీసుకువచ్చి మాట్లాడారు.
నగరానికి చెందిన బాబాఫకృద్దీన్‌తో తనకు 11 ఏళ్ల క్రితం వివాహమైందని, తమకు ఇద్దరు ఆడపిల్లలు సంతానమని వివరించారు. తనను భర్త తరచూ కొట్టేవాడన్నారు. తాజాగా చంపుతానని బెదిరిస్తున్నాడని వాపోయారు. నీలిమ సమస్యపై ఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ.. విచారణ, తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఎస్‌బీ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.