బియ్యం మాటున ‘ఎర్ర’ స్మగ్లింగ్‌  | Sakshi
Sakshi News home page

బియ్యం మాటున ‘ఎర్ర’ స్మగ్లింగ్‌ 

Published Mon, Sep 6 2021 3:31 AM

13 interstate robbers arrested in Chittoor - Sakshi

చిత్తూరు అర్బన్‌ (చిత్తూరు జిల్లా):  ఓ కంటైనర్‌లో రూ.1.5 కోట్ల విలువచేసే ఎర్రచందనం దుంగలను తీసుకెళ్తూ ఎవరికీ అనుమానం రాకుండా దుంగలపైన బియ్యం బస్తాలను వేసినా పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరులో ఈ వివరాలను ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఆదివారం విలేకరులకు వివరించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పీలేరు వద్ద ఎర్రచందనం దుంగలు తరలుతున్నట్లు సీఐ సాధిల్‌అలీకి సమాచారం రావడంతో పోలీసులు సరిహద్దుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఓ కంటైనర్‌కు ముందు, వెనుక వైపు ఎస్కార్ట్‌లుగా వాహనాలు వెళుతుండగా వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కంటైనర్‌ను తెరచి చూశారు.

తొలుత ఇందులో పోలీసులకు బియ్యం బస్తాలు కనిపించాయి. వాటిని కిందకు దింపించి చూస్తే పెద్ద సంఖ్యలో ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపగా.. గుడిపాల సరిహద్దుల్లో మరో రెండు వాహనాల్లో తరలుతున్న ఎర్రచందనం దుంగలు, తీసుకెళుతున్న వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి నుంచి తమిళనాడుకు ఎర్రచందనం దుంగలు తీసుకెళుతున్నట్లు విచారణలో తేలింది.

ఘటనలో వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన కొత్త సురేంద్రరెడ్డి (27), వసంతు అశోక్‌కుమార్‌రెడ్డి (40), తిరుపతికి చెందిన అప్పిలి మురళి (29), యర్రమరెడ్డి రామంజులు (41), తలారి వికేష్‌ (26), యాదమరికి చెందిన చేంద్ర శ్రీరాములు వెంకటేష్‌ (32), తమిళనాడు తిరుపత్తూర్‌కు చెందిన స్వామినాథన్‌ సంజీవ్‌ (24), వేలూరుకు చెందిన జి.విజయకాంత్‌ (28), ఎస్‌.శక్తివేల్‌ (30), ఆర్‌.విజయ్‌కుమార్‌ (36), ఎం.వేలుసామి (42), రాజమని హరిమూర్తి (42), తిరువణ్ణామలైకి చెందిన ధనతరాన్‌ ఏలుమలై (37)లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడున్నర టన్నుల బరువున్న 115 ఎర్రచందనం దుంగలు, నాలుగు కార్లు, ఓ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement