ఒంటరి..తుంటరి! | - | Sakshi
Sakshi News home page

ఒంటరి..తుంటరి!

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

హడలెత్తిస్తున్న ఒంటరి మదపటేనుగులు భయాందోళనలో స్థానికులు వ్యవసాయ పొలాల వద్దనున్న ఇళ్లను టార్గెట్‌ చేస్తున్న వైనం ఒకే ఇంటిపై ఇప్పటికే మూడు దఫాలు దాడి

పలమనేరు: కౌండిన్య అభయారణ్యంలో ఒంటరి మదపుటేనుగులు హడలెత్తిస్తున్నాయి. అడవి దాటి వచ్చిన ఆడ ఏనుగులకంటే మదపుటేనుగులే ప్రజల ప్రాణా లు తీస్తున్నాయి. వీటితోనే ఎక్కువగా పంటలు కూడా ధ్వంసమవుతున్నాయి.

మదపుటేనుగుల రూటే వేరు

పలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్‌రేంజిల పరిధి లోని కౌండిన్య అభయారణ్యంలోని ఏనుగులతోపాటు అటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, క్రిష్ణగిరి, కావేరిపట్నం , కర్ణాటకలోని హొసూర్‌, బన్నేర్‌గట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ప్రవేశించే ఏనుగులున్నాయి. స్థానికంగా ఉన్న గుంపుల్లో మొత్తం 12 మగ ఏనుగులుండేవి. వీటిలో ఏడు మృతిచెందగా ఇప్పుడు ఐదు మగ ఏనుగులు(మదపుటేనుగులు) ఉన్నాయి. గుంపు నుంచి దూరంగా ఉండి ఒంటరిగా సంచరిస్తున్నాయి. ఒక్కో మదపుటేనుగు ఎంపిక చేసుకున్న ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా క్రూ రంగా ప్రవర్తిస్తుంటాయి. జనంపైకి దాడులు చేయడం, లేదా తరమడం చేస్తుంటాయి. మదపుటేనుగులపై జనం రాళ్లు విసరడం, టపాకాయలను పేల్చడం, టైర్లు కాల్చి వాటి శరీరంపైకి విసరడం లాంటి చర్యలతో మగ ఏనుగులు జనంపై కసి పెంచుకున్నాయి.

ఇంటిని ధ్వంసం చేసింది

మండలంలోని కౌండిన్య అభయారణ్యంలో సంచరిస్తున్న ఒంటరి మదపుటేనుగు ఓ ఇంటిని ధ్వంసం చేసిన ఘటన మండలంలోని చిన్నకుంట వద్ద ఉన్న మర్రిమాకులపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాణెమ్మ కుటుంబం పొలం వద్దే ఇల్లు కట్టుకుని నివాసముంటున్నారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అడవిలోని సోలార్‌ ఫెన్సింగ్‌ను విరిచేసి బయటకు వచ్చిన మదపుటేనుగు రాణెమ్మ ఇంటిని ధ్వంసం చేసింది. ఇంట్లోని ధాన్యం, బియ్యం తదితరాలను ఆరగించింది. ఈ సమయంలో రాణెమ్మ కుటుంబం గంటావూరు గంగజాతరకు వెళ్లి ఉండడంతో ఆ కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. ఆపై ఏనుగు పక్కనే ఉన్న వరి పంటను ఆరగించింది. ఆ తర్వాత మామిడి చెట్లను విరిచేసింది. దీన్ని గమనించిన స్థానికులు కేకలు వేస్తూ ఏనుగును తరిమేందుకు యత్నించగా వారిపైకి ఎదురు తిరిగింది. అక్కడికి చేరుకున్న ఎలిఫెంట్‌ ట్రాకర్స్‌ ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు బాణసంచా పేలుస్తూ భయపెట్టారు. కానీ అది ఏమాత్రం భయపడలేదు. పంటలను ధ్వంసం చేసుకుంటూ తాఫీగా అడవిలోకి వెళ్లింది. కాగా ఇదే ఇంటిని మదపుటేనుగు మూడు దఫాలు ధ్వంసం చేసినట్టు బాధితులు తెలిపారు. గత నెల రోజులుగా రెండు మదపుటేనుగులు వేర్వేరుగా సంచరిస్తూ అటవీ సమీప గ్రామాల్లోని వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నాయి. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి కూతవేటు దూరంలోనే కుంకీ ఎలిఫెంట్‌ ప్రాజెక్టు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement