చిత్తూరు అర్బన్: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో ఎం.మేఘనాథనాయుడు (42) అనే ముద్దాయికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు తీర్పునిచ్చింది. మదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వాతి కథనం మేరకు.. చిత్తూరుకు చెందిన మేఘనాథనాయుడుకు సుధా అనే మహిళతో 2014లో పెళ్లయ్యింది. వివాహ సమయంలో భారీ కట్న కానుకలు, బంగారు ఆభరణాలు వధువు తరఫున తల్లిదండ్రులు అల్లుడికి ఇచ్చారు. అయితే ఓ మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న నిందితుడు అదనపు కట్నం కోసం తరచూ తన భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీనిపై బాధితురాలు 2020లో చిత్తూరులోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు సాక్ష్యాధారాలు అందజేశారు. నేరం ఋజువు కావడంతో మేఘనాథనాయుడుకు రెండేళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ చిత్తూరులోని మూడో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు తీర్పునిచ్చింది.
బంగారు గొలుసు లాగేశారు!
పలమనేరు: తన మెడలోని బంగారు ఆభరణాన్ని లాక్కొన్నారని ఓ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరులో గంగమ్మ జాతరకు తమిళనాడుకు చెందిన ఉష అనే మహిళ తన బంధువుల ఇంటికొచ్చింది. అయితే ఇదే సమయంలో అదే ప్రాంతానికి చెందిన నాగరత్నమ్మ అనే మరో మహిళ ఉషపై గొడవకు దిగి ఆమె మెడలోని బంగారు ఆభరణాన్ని లాక్కెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా తనకు ఉష రూ.5 లక్షలు బాకీ ఉన్నందునే తాను ఇలా చేశానని నాగరత్నమ్మ చెబుతోంది. ఫిర్యాదు మేరకు కేసును పోలీసులు విచారిస్తున్నారు.
టమాట మార్కెట్లో
అగ్ని ప్రమాదం
పలమనేరు: పట్టణంలోని టమాట మార్కెట్ కమిటీలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్‌లోని వ్యర్థాలు, టమాట బాక్సులున్న చోట మంటలంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరు కుని మంటలను అదుపు చేశారు.
పిడుగుపాటుకు
మేకల కాపరి మృతి
కార్వేటినగరం: పిడుగు పాటుకు మేకల కాపరి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పద్మసరస్సు సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. పద్మసరస్సు ఎస్టీ కాలనీకి చెందిన దేశయ్య కుమారుడు జీ.వెంకటస్వామి (60) రోజూమాదిరిగానే మంగళవారం మేతకోసం అడవికి మేకలు తోలుకెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో అటవీ ప్రాంతంలోనే ఉన్న వెంకటస్వామిపై ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో వెంకటస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. సాయంత్రం పొద్దుపోతున్నా మేకల వద్దకు వెళ్లిన వ్యక్తి రాకపోవడంతో అతన్ని వెదుక్కుంటూ కుటుంబ సభ్యులు అటవీ ప్రాంతానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ వెంకటస్వామి విగతజీవిగా పడి ఉండడంతో బోరున విలపించారు. తర్వాత మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.
త్వరలో దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ
శ్రీసిటీ (వరదయ్యపాళెం): దివ్యాంగ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శ్రీసిటీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. విజయవాడలో ఈ నెల 25న నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్–2026లో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషనన్‌తో ఈ మేరకు శ్రీసిటీ ఎండీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. గ్రోత్ సమ్మిట్‌లో డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీ ఎప్పుడూ సమగ్ర అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ, ఇతర నైపుణ్యాలు అందించడం ద్వారా వారికి స్వయం ఉపాధి మార్గాలను సృష్టించడమే కాకుండా, సామాజిక సమానత్వం, పారిశ్రామిక పురోగతిపై తమ కట్టుబాటును మరింత బలపరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ‘‘ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త’’ లక్ష్యానికి అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్‌లో కోటి మంది వ్యాపారవేత్తలను తయారు చేయాలనే సంకల్పానికి దివ్యాంగ యువత శిక్షణ కార్యక్రమం తోడ్పాటు అందించనుందని పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ, దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ అందించేందుకు శ్రీసిటీ చొరవ చూపడం అభినందనీయమన్నారు.


