పలమనేరు: పలమనేరు అటవీశాఖ పరిధిలోని కౌండిన్య అభయారణ్యంలో వన్యప్రాణుల వేట గట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఇప్పటిదాకా నాటుతుపాకులు, నల్లమందు ఉండలు పెట్టి వేటగాళ్లు వేటాడేవారు. కానీ ఇప్పుడు పాత పద్ధతులైన కమ్మీలతో ఉరులేస్తూ వన్యప్రాణుల వేటను కొనసాగిస్తున్నట్టు సమాచారం.
బీట్లలో పట్టు తగ్గుతోందా?
కౌండిన్యలోని పలు బీట్లల్లో బీట్‌ఆఫీసర్లు, ఏబీవోలకు కుంకీ ఎలిఫెంట్ పనులు, ఇతర పనులను అప్పగించడంతో వీరు బిజీ అయ్యారు. ఇక కొత్తగా విధుల్లో చేరిన మహిళా సిబ్బంది అడవిలోకి వెళ్లడం లాంటి పనులు తక్కువే. ఇదే వేటగాళ్లకు అదునుగా మారింది. పగటిపూట కమ్మీ ఉరులు వేసేందుకు వీలుగా మారింది.
వేటగాళ్లకు నిలయం కౌండిన్య
పలమనేరు మండలం నుంచి బైరెడ్డిపల్లె, వి.కోట మండలం వరకు కౌండిన్యా అభయారణ్యం వ్యాపించి ఉంది. ఈ ప్రాంతానికి దక్షిణంగా తమిళనాడులోని మోర్ధన అటవీ ప్రాంతం ఉంది. ఈ అడవిలో ఏనుగులతో పాటు వేల సంఖ్యలో దుప్పులు, జింకలు, అడవి పందులు, కుందేళ్లు తదితర వన్య ప్రాణులున్నాయి. ఈ అడవికి ఆనుకొని దాదాపు 60 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని కొందరు నిత్యం అడవికి వేటకెళ్లడం జీవనోపాధిగా మార్చుకున్నారు. వన్యప్రాణుల వేటకోసం పాత వేట పద్ధతులను ఎంచుకున్నారు. కమ్మీలు, వైర్లతో తయారు చేసిన ఉచ్చులను పగటి పూట అడవిలో చెట్ల మధ్య అమర్చడం, వాటిల్లో ఏవైరా జంతువులు ఇరుక్కుంటే వాటిని అక్కడే చంపి మాంసాన్ని తీసుకురావడం జరుగుతోంది. ఈ వేటగాళ్ల కారణంగా ఊరకుక్కలు, అడవిలో మేతకెళ్లే పశువులు, మేకలు తరచూ బలవుతూనే ఉన్నాయి.
పాత గిరాకీలకే అడవి మాంసం
వేటగాళ్లు రెగ్యులర్‌గా అడవి మాంసం కొనే పలువురితో టచ్‌లో ఉంటున్నారు. మొత్తం సెల్‌ఫోన్లతోనే వీరి వ్యాపారం సాగుతోంది. ఇళ్లవద్దకే మాంసం కావాలన్నా అందిస్తున్నారు. వన్యప్రాణులను బట్టి ధరలు కిలో రూ.300 నుంచి రూ.400 దాకా ఉన్నట్టు సమాచారం. స్థానిక మార్కెట్‌లో పొట్టేలు మాంసం కిలో రూ.850 దాకా ఉంది. దీనికంటే అడవి మాంసం తక్కువ ధర కాబట్టి రిస్క్ అయినా వీటినే కొంటున్నారని తెలిసింది. ప్రస్తుత కొత్త ఎఫ్‌ఆర్వో చాప్లానాయక్ అయినా వేటగాళ్లకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


