● ముగ్గురికి తీవ్ర గాయాలు ● ఒకరి పరిస్థితి విషమం
గుడిపాల: రెండు బైక్‌లు పక్కపక్కనే వెళ్లడం వల్ల అదుపు తప్పి ఢీ కొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. మంగళవారం గుడిపాల మండలం, బొమ్మసముద్రంలో గంగజాతర సందర్భంగా బొమ్మసముద్రం గ్రామానికి చెందిన ధనుష్ ఇంటికి కర్నూలు, హిందూపురానికి చెందిన స్నేహితులు ప్రభాస్, అజిత్, నితిన్‌లు సోమవారం రాత్రి వచ్చారు. తిరిగి చిత్తూరుకు వెళ్లేందుకు సోమవారం రాత్రి 11.50 నిమిషాలకు బయలుదేరారు. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి భద్రకళమ్మ దేవాలయం సమీపంలోని ఓవర్ బ్రిడ్జిపై బైక్‌లో పక్కపక్కనే వేగంగా వెళ్లడంతో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో అజిత్, ధనుష్, నితిన్‌లు తీవ్రంగా గాయపడగా 108 వాహనంలో చీలాపల్లె సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ప్రభాస్(23) పరిస్థితి విషమంగా ఉండడంతో రాణిపేట సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


