జిల్లాలో గాలీవాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో గాలీవాన బీభత్సం

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

● చిత్తూరు, గంగాధరనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో దంచికొట్టిన వాన ● ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వర్షం ● నేలరాలిన మామిడి పంట ● రోడ్లపై కూలిన చెట్లు ● విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

కాణిపాకం: జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం గంటకు పైగా కొనసాగింది. ఈదురుగాలులతో కూడిన గాలీవాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా చిత్తూరు, గంగాధరనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో భారీ వర్షం దంచికొట్టింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్లు పడ్డాయి.

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

బలమైన ఈదురు గాలులకు రహదారుల వెంబడి ఉన్న చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. పలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ శాఖ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు.

మామిడికి తీవ్ర నష్టం

అకాల వర్షం, గాలీవానతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే కోత దశకు వచ్చిన పంట నేలరాలిపోయింది. వడగండ్ల వర్షంతో పండ్లు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు.

రోడ్డుపై పడ్డ బండరాళ్లు

గుడిపాల: చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి చీలాపల్లె సీఎంసీ ఆసుపత్రి వద్ద మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం, ఈదురు గాలులకు పక్కనే ఉన్న గుట్టలో నుంచి బండరాళ్లు ఒక్కొక్కటిగా రోడ్డుపై పడ్డాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారి పక్కన ఉన్న గుట్టకు సరైన భద్రత లేకపోవడంతో ఒక్కో బండరాయి రోడ్డుపై పడుతూనే ఉన్నాయి. స్థానికులు రోడ్డుపై ఉన్న రాళ్లను చూసి వాహనాలను ఆపి వాటిని రోడ్డుపక్కలో పడేశారు.

చిత్తూరులో అలజడి

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగర వాసులకు మంగళవారం కాస్త ఉపశమనం లభించింది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ గాలులతో కూడిన వర్షం పడింది. దాదాపు గంటకు పైగా గాలీవాన బీభత్సం సృష్టించింది. నగరంలోని పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ స్తంభాలు సైతం పడిపోయాయి. మున్సిపల్‌ కార్మికులు, విద్యుత్‌శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా రోడ్డుపై కూలిన వృక్షాలను తొలగించారు.

చిత్తూరు విరిగిపడ్డ కొమ్మలను తొలగిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

నగరిలో నేల రాలిన మామిడి కాయలు

Advertisement
 
Advertisement
Advertisement