టీడీపీ మహిళా నాయకురాలి ప్రోద్బలంతోనే దౌర్జన్యాలు గ్రానైట్ ఫ్యాక్టరీ కోసం భూఆక్రమణ న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌లో బాధితురాలి కన్నీటి ఆవేదన!
చిత్తూరు కలెక్టరేట్ : రాజకీయ అండదండలతో తమ వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న కబ్జాదారుల నుంచి రక్షణ కల్పించాలంటూ పెనుమూరు మండలం, మణియానంపల్లికి చెందిన బాధితురాలు రేణుక కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం ఆమె పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తనకు పసుపు, కుంకుమ కింద తల్లిదండ్రులు ఇచ్చిన భూమిపై కబ్జాదారులు కన్ను పడిందన్నారు. పులికల్లు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నం.1007/1లోని 1.41 ఎకరాల సెటిల్మెంట్ భూమిని ఆక్రమించుకుంటున్నారని చెప్పారు. దారి ఇవ్వలేదనే కక్షతో.. టీడీపీ ‘తెలుగు మహిళ’ నాయకురాలు కర్జాల అరుణ ప్రోద్బలంతో, గ్రామానికి చెందిన చిన్నబ్బనాయుడు కుమారుడు గిరిబాబు, లోకనాథనాయుడు కుమారుడు హరిబాబు, శ్రీరాములునాయుడు కుమారుడు తిలక్, వెంకటరామానాయుడు కుమారుడు శంకరనాయుడు, జానకీరామానాయుడు కుమారుడు వినయ్‌లు గతంలో దాడికి పాల్పడ్డారన్నారు. ఆ కక్షతోనే 2025 డిసెంబర్ 10వ తేదీన తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారని ఆమె వాపోయారు. అంతేకాకుండా, అప్పట్లోనే తమ పొలం నుంచి కొంత భూమిని దౌర్జన్యంగా లాక్కొని గ్రామానికి దారి ఏర్పాటు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


