బక్రీద్‌ పొట్టేళ్లా మజాకా! | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌ పొట్టేళ్లా మజాకా!

May 24 2026 1:33 AM | Updated on May 24 2026 1:33 AM

● రూ.లక్షలు పలికిన పొట్టేళ్లు ● రాష్ట్రంలోనే పొట్టేళ్ల సంతకు బైరెడ్డిపల్లి ఫేమస్‌ ● ఐదు రాష్ట్రాల నుంచి వ్యాపారుల రాక ● బక్రీద్‌కు ముందు సంతలో రూ.కోట్లలో వ్యాపారం

బక్రీద్‌ కోసమే వీటి సంరక్షణ

బక్రీద్‌ పండుగలో మాంసాహారం చాలా ముఖ్యం. స్థోమత గల ముస్లింలు కుర్బానీ పేరిట పేదలకు మాంసం దానంగా ఇస్తారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో చాలామంది ఈ పండుగ కోసమే పొట్టేళ్లను మేపుతారు. ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం(అవిభక్త) జిల్లాలు, కర్ణాటకాలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో పొట్టేళ్ల పెంపకం చేపడుతున్నారు. వీటికి పచ్చిగడ్డితో పాటు బూసా, గానుగ పిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి మేపుతారు. దీంతో కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు బలిష్టంగా సిద్ధమవుతాయి. వీటిని ఇక్కడి సంతకు తీసుకొచ్చి అమ్ముతుంటారు.

పలమనేరు/బైరెడ్డిపల్లి : ఒక్కో ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. పశువుల సంత కావొచ్చు. వంటలు కావొచ్చు. ఆధ్యాత్మికపరంగానూ కావచ్చు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి పొట్టేళ్ల సంతకు ప్రత్యేకత. ఇక్కడికి ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణా రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తారు. ఈ నెల 28వ తేదీన ముస్లింలు బక్రీద్‌ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో శనివారం నిర్వహించిన సంతలో రూ.కోట్లలో వ్యాపారాలు సాగాయి. ఇక్కడి పొట్టేళ్లు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ధర పలకడం విశేషం.

కార్లు, వాహనాలతో కిటకిటలాడిన మార్కెట్‌

బైరెడ్డిపల్లెలోని సంతలో మేకలు, గొర్రెలు, పొట్టేళ్ల వ్యాపారం ఎక్కువగా సాగుతుంది. వాటిని వ్యాపారులు టెంపోల్లో తరలిస్తుంటారు. కొంతమంది కార్లలో తీసుకెళతారు. ఈ క్రమంలో శనివారం జరిగిన సంతకు వేలాది కార్లు, వాహనాలు వచ్చాయి. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాలను అదుపు చేసేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది.

కోట్లలో వ్యాపారం

బక్రీద్‌ సందర్భంగా శనివారం జరిగిన సంతలో రూ.20 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్టు సమాచారం. సాధారణ శనివారాల్లో ఇక్కడికి 20 వేలకు పైగా పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు వస్తాయి. బక్రీద్‌ పండుగ సంతకు సుమారు లక్ష వరకు జీవాలను తీసుకువచ్చారు. జత పొట్టేళ్లు రూ.60 వేల నుంచి అత్యధికంగా రూ.2 లక్షలకు పైగా అమ్ముడయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement