‘నరక’దారి!
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్ ప్రధాన కార్యాలయ ఆవరణలో గురువారం ఉదయం ఒక ఘటన చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం, కనీస సమాచార బోర్డులు లేకపోవడం ఒక సామాన్య మహిళ ప్రాణాలమీదికి తెచ్చింది. కలెక్టరేట్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, పశువులు లోపలికి రాకుండా ఉండడానికి భూగర్భంలో ఇనుప గ్రిల్స్‌తో కూడిన ప్రత్యేక దారిని ఏర్పాటు చేశారు. అయితే, కాలినడకన వచ్చే ప్రజల కోసం దీని పక్కనే సాధారణ సిమెంట్ నడక దారి కూడా ఉంది. గురువారం ఉదయం కలెక్టరేట్‌కు అత్యవసర పనిమీద వచ్చిన ఒక మహిళకు, అక్కడ ఏది నడక దారి.. ఏది వాహనాల దారి అని సూచించే ఎటువంటి సైన్ బోర్డు లు కనిపించకపోవడంతో ఆమె నేరుగా ఇనుప గ్రిల్స్ ఉన్న మార్గంలో నడవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కాలు జారి, ఇనుప కడ్డీల మధ్య ఆమె కాలు ఇరుక్కుపోయింది. కడ్డీల పదునైన అంచులు గుచ్చుకోవడంతో ఆమె అల్లాడిపోయారు.
గంటపాటు అగచాట్లు
మహిళ అరుపులు విన్న వెంటనే కలెక్టరేట్ సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు పరుగున వచ్చారు. ఇనుప గ్రిల్స్ మధ్య కాలు గట్టిగా ఇరుక్కుపోవడంతో ఆమెను బయటకు తీయడం సిబ్బందికి సవాల్‌గా మారింది. దాదాపు గంటసేపు సిబ్బంది తీవ్రంగా శ్రమించిచాకచక్యంగా ఆమెను సురక్షితంగా బయటకు తీశారు.


