అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర విశ్వరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు ప్రత్యేక ఆకర్షణగా వజ్ర కిరీట అలంకరణ జనసంద్రమైన కుప్పం వీధులు ప్రభుత్వం తరఫున సారె సమర్పించిన సీఎం దంపతులు
కుప్పం: స్థానిక తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగింది. గంగమ్మ విశ్వరూప దర్శనానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి వజ్ర కిరిటాన్ని అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన శిరస్సు ఊరేగింపు బుధవారం ఉదయం 7 గంటలకు ఆలయానికి చేరుకుంది. ఆలయ సంప్రదాయపద్ధతి ప్రకారం పూజలు చేసి అమ్మవారికి శిరస్సును అలంకరించి విశ్వరూప దర్శనానికి భక్తులను అనుమతించారు.
సారే సమర్పణ
గంగమ్మ జాతరలో విశ్వరూప దర్శనం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు అమ్మవారికి ప్రభుత్వం తరఫున సారె సమర్పించారు. ప్రతి ఏటా టీటీడీ నుంచి అమ్మవారికి సారె సమర్పించేవారు. అయితే రెండేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబునాయుడు టీటీడీ నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. విచిత్ర వేషధారణలో భక్తులు ఆకట్టుకున్నారు.
కిక్కిరిసిన కుప్పం
తిరుపతి గంగమ్మ విశ్వరూప దర్శనానికి జనం పోట్టెత్తారు. కుప్పం ప్రాంత వాసులే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలు సైతం భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుప్పం వీధులన్నీ జనంతో నిండిపోయాయి. ఆలయ ప్రాగణం, నేతాజీ రోడ్డు, న్యూ లింక్ రోడ్డు, ప్యాలెస్ ఎక్స్‌టెక్షన్, హెచ్‌పీ రోడ్డులో ఇసుకేస్తే రాలనంతగా భక్తులు నిండిపోయారు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.


