చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి మంగళవారం ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాన్ఫరెన్స్‌లో క్షేత్ర స్థాయి అధికారులకు సూచనలిచ్చారు.
ప్రత్యేక బృందాలు
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 37 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం జనరల్ 8,861, వొకేషనల్ 628 మొత్తం 9,489, రెండవ సంవత్సరం జనరల్ 5,874, వొకేషనల్ 524 మొత్తం 6,398 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 4వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు
సప్లిమెంటరీ పరీక్షలను పబ్లిక్ పరీక్షల తరహాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టాం. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇది ఉన్నత చదువుల భవిష్యత్‌ను నిర్ణయించే కీలకమైన అవకాశం. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశాం. ప్రతి కేంద్రంలోనూ ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించాం.
– రఘుపతి, ఇంటర్మీడియెట్, డీఐఈవో


