మందుల్లేక.. ఇబ్బందులు పడలేక! | - | Sakshi
Sakshi News home page

మందుల్లేక.. ఇబ్బందులు పడలేక!

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

జిల్లా వ్యాప్తంగా మెడికల్‌ షాపుల బంద్‌ సకాలంలో మందుల్లేక అల్లాడిన రోగులు ఈ–ఫార్మసీలపై కెమిస్టుల ఆగ్రహం

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు జ్యోతి. యాదమరి మండలం, మాధవరం గ్రామం. మధుమేహ మాత్రలు ఖాళీ అవ్వడంతో ఆటోలో చిత్తూరు నగరానికి వచ్చింది. వచ్చే దారిలో ఎక్కడా మెడికల్‌ షాపులు లేకపోవడంతో.. నేరుగా సుందరయ్య వీధికి వచ్చింది. అక్కడ కూడా షాపులన్నీ మూతబడడంతో మందులు, మాత్రల కోసం గాలించింది. ఎక్కడా దొరకకపోవడంతో తిరిగి ఇంటిబాట పట్టింది.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఆన్‌లైన్‌ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా ఔషధ వ్యాపారులు ఉద్యమబాట పట్టారు. అఖిల భారత ఔషధ వ్యాపారుల సంఘం (ఏఐఓసీడీ) పిలుపుతో బుధవారం జిల్లా వ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌ పాటించారు. అసోసియేషన్‌ సభ్యులు రోడెక్కారు. నిరసనలతో హోరెత్తించారు. జిల్లాలో వేలాది మెడికల్‌ షాపులు మూతపడగా.. మందుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వెయ్యికి పైగా షాపులు మూత

జిల్లాలో సుమారు వెయ్యికి పైగా మెడికల్‌ షాపులు బంద్‌లో పాల్గొన్నట్లు కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. పట్టణాల్లో బంద్‌ ప్రభావం స్పష్టంగా కనిపించగా.. పల్లె ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు సాధారణ పరిస్థితులు కొనసాగాయి. అయినప్పటికీ చాలాచోట్ల మందులు దొరక్క ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మందుల కోసం పరేషాన్‌

బంద్‌ విషయం ముందుగా తెలిసిన వారు మందులు, మాత్రలు కొనుగోలు చేసి నిల్వ చేసుకోగా.. సమాచారం లేని వారు షాపుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడ్డారు. ముఖ్యంగా షుగర్‌, బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర మందుల కోసం కొందరు ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి తిరగడం కనిపించింది. సాయంత్రానికి షాపులు తెరుచుకోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.

ఈ–ఫార్మసీలే లక్ష్యం

ఆన్‌లైన్‌ ఫార్మసీలు భారీ డిస్కౌంట్ల పేరుతో ప్రజలను ఆకర్షిస్తూ స్థానిక మెడికల్‌ షాపులను దెబ్బతీస్తున్నాయని వ్యాపారులు మండిపడ్డారు. ఎలాంటి డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మందులు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి నకిలీ ప్రిస్క్రిప్షన్లు సష్టిస్తున్నారని అసోసియేషన్‌ ప్రతినిధులు ఆరోపించారు. తనిఖీలు లేకపోవడంతో నకిలీ, నాసిరకం మందులు మార్కెట్లోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

చిన్న వ్యాపారులపై కార్పొరేట్‌ దెబ్బ

కార్పొరేట్‌ ఈ–ఫార్మసీలు భారీ పెట్టుబడులతో మార్కెట్‌ను ఆక్రమిస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న మెడికల్‌ షాపులు తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నాయని కెమిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసమాన పోటీ కొనసాగితే చిన్న వ్యాపారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. చిత్తూరు సహా పలు పట్టణాల్లో కెమిస్టులు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆన్‌లైన్‌ మందుల విక్రయాలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. చిత్తూరు నగరంలో సుందరయ్యవీధి నుంచి అసోసియేషన్‌ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసనలతో హోరెత్తించారు. వెంటనే ఈఫార్మసీని కట్టడి చేయాలని డిమాండ్‌ చేశారు. జీడీనెల్లూరులో అసోసియేషన్‌ సభ్యులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నగరి, కుప్పం, పలమనేరులో కూడా పలువురు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. మధ్యాహ్నం పైగా షాపులు తెరుచుకున్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఎమర్జెన్సీ ఫార్మసీలు తెరిచి ఉంచారు.

Advertisement
 
Advertisement
Advertisement