మామిడి మద్దతు ధరపై మళ్లీ అయోమయం మార్కెట్‌కొచ్చే కొంత సరుకుకే ధరలేని వైనం గతేడాది గాయం మానకముందే మరోసారి కష్టకాలం ఆందోళనలో అన్నదాతలు
చిత్తూరు జిల్లా మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. ఇప్పుడిప్పుడో కోతలు ప్రారంభమై మార్కెట్‌కు కాయలు వస్తున్నా ఆశించిన స్థాయిలో ధరలేక విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం టేబుల్ రకాలే కోతకొస్తుండగా.. వాటికే గిట్టుబాటు ధరలేదని ఆవేదన చెందుతున్నారు. ఇక అత్యధికంగా సాగయ్యే తోతాపురి పరిస్థితి ఎలా ఉంటుందోనని భయాందోళనకు గురవుతున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ నష్టాలు తప్పవనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రైతులు చర్చించుకుంటున్నారు.
కాణిపాకం: చిత్తూరు జిల్లాలో ఈ సారి భారీ స్థాయిలో మామిడి దిగుబడి వచ్చే అవకాశముందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో మొత్తం 59,326 హెక్టార్లలో మామిడి సాగు చేయగా.. సుమారు 6,21,252 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని లెక్కలుగడుతున్నారు. ఇందులో తోతాపురి అత్యధికంగా 40,024 హెక్టార్లలో సాగవుతుండగా.. 4,83,981 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అలాగే బేన్నీషా 6,856 హెక్టార్లలో 42,242 టన్నులు, కాదర్ 2,702 హెక్టార్లలో 18,834 టన్నులు, నీలం 5,178 హెక్టార్లలో 42,242 టన్నులు, మల్లిక 1,349 హెక్టార్లలో 10,444 టన్నులు, ఇతర రకాల నుంచి 23,509 టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. భారీ దిగుబడి అంచనాలతో రైతుల్లో ఒకవైపు ఆశలు కనిపిస్తున్నా.. మరోవైపు ధరలపై భయం పెరుగుతోంది.
ఇదీ ఫ్యాక్టరీల పరిస్థితి
జిల్లాలో మొత్తం 39 మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు ఉండగా.. ప్రస్తుతం 31 వరకు పనిచేస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో గుజ్జు తయారీ ప్రారంభించినవి ఆరు మాత్రమేనని తెలుస్తోంది. అధికారులు మాత్రం 12 ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం అల్ఫోన్సో రకం గుజ్జు తయారీ జరుగుతోంది. గతేడాది తయారైన గుజ్జులో సుమారు 25 శాతం నిల్వలు ఇంకా మిగిలి ఉండడంతో చాలా ఫ్యాక్టరీలు ఈ సారి కొనుగోళ్లకు వెనుకంజ వేస్తున్నాయి. ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తోతాపురి ఒకేసారి మార్కెట్‌కు వచ్చే అవకాశముందని రైతులు చెబుతున్నారు. దీంతో ఫ్యాక్టరీల వద్ద టోకెన్లు, క్యూలు, రోజులు తరబడి వేచిచూడాల్సిన పరిస్థితులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి ఇలా..
ప్రస్తుతం జిల్లాలో బేన్నీషా, కాదర్, పులేరా, మల్లికా, టేబుల్ రకాలతోఆపటు తోతాపురి రకాలు మార్కెట్‌కు వస్తున్నాయి. మార్కెట్‌లో బేన్నీషా కేజీ రూ.18 నుంచి రూ.25 వరకు, కాదర్ రూ.20 నుంచి రూ.25, పులేరా రూ.6 నుంచి రూ.15, మల్లికా రూ.25 నుంచి రూ.35, తోతాపురి రూ.13 నుంచి రూ.17 వరకు పలుకుతున్నాయి. ఈ ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు.
గతేడాది కోలుకోని దెబ్బ
గతేడాది మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రారంభంలో ధరలు పర్వాలేదనిపించినా.. తర్వాత ఒక్కసారిగా కూలిపోయాయి. ముఖ్యంగా తోతాపురి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని రైతులు చర్చించుకుంటున్నారు. టేబుల్ రకాలకే ఇలా ఉంటే.. ఇక తోతాపురి పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. గతేడాది ప్రభుత్వం తోతాపురికి కేజీ రూ.8 మద్దతు ధర ప్రకటించింది. కానీ ఆ ప్రకటన కాగితాలకే పరిమితమైంది. ఒకటి రెండు ఫ్యాక్టరీలు మాత్రమే రూ.5 నుంచి రూ.6 వరకు చెల్లించగా.. మిగతా ఫ్యాక్టరీలు కేజీకి రూ.4కే కొనుగోలు చేశాయని రైతులు చెబుతున్నారు. అదికూడా కొన్ని ఫ్యాక్టరీలు గతేడాది బకాయిలు చెల్లించలేదని రైతులు ఆరోపిస్తున్నారు.


