‘కంది’పోతున్నారు బాబూ! | - | Sakshi
Sakshi News home page

‘కంది’పోతున్నారు బాబూ!

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

● రేషన్‌ దుకాణాల్లో దొరకని కందిపప్పు ● హామీలు ఇచ్చి చేతులెత్తేసిన కూటమి సర్కార్‌

గుడిపాల: కూటమి ప్రభుత్వంలో పేదోడికి పప్పన్నం కరువైంది. పేదలకు కందిపప్పు కూడా రేషన్‌ దుకాణాల ద్వారా అందించలేక పోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఇంటి వద్దకే రేషన్‌ రద్దు చేసిన సర్కార్‌... జనాలను దుకాణాల వద్ద క్యూకట్టి నిరీక్షించాల్సిన దుస్థితికి తీసుకొచ్చింది.

అంతా ఆర్భాటమే

రేషన్‌ దుకాణాల్లో అన్ని నిత్యావసర సరుకులు తక్కువ ధరకు దొరికేలా మాల్స్‌లా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు ప్రచారం చేసిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. క్షేత్ర స్థాయిలో పేద, మధ్య తరగతి ప్రజలకు అవసరమైన కంది పప్పు సరఫరా నిలిపివేశారు. గత ప్రభుత్వంలో బియ్యం, పంచదార, కంది పప్పు, గోధుమ పిండి పంపిణీ చేసేవారు. కిలో కంది పప్పు రూ.67కే ఇచ్చేచారు. కానీ ఇప్పుడు బియ్యం, చక్కెర తప్ప మిగిలిన ఏ నిత్యావసర వస్తువూ అందించడం లేదు.

24 నెలలుగా ఎదురుచూపులే

చిత్తూరు జిల్లాలో 5.4 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటికి సంబంధించి 1,370 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీరంతా ప్రతినెలా రేషన్‌ డిపోలో ఇచ్చే కంది పప్పు కోసం ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా కార్డుదారులు కంది పప్పు వచ్చిందా... ఎప్పుడొస్తుంది,. అసలు ఇస్తారా లేదా అని ప్రశ్నలు అడుగుతుంటే రేషన్‌ డీలర్లు తెల్లమొహం వేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కంది పప్పు రూ.140 నుంచి రూ.155 వరకు ధర పలుకుతోంది. అంత ధర పెట్టి కొనలేని పేద, మధ్య తరగతి ప్రజలు రేషన్‌ షాపుల్లో ఎప్పుడిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మహిళలకు 24 నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు.

పప్పు పంపిణీ చేయాలి

ఎన్నికలకు ముందు అన్ని సరుకులు రేషన్‌ షాపుల్లో దొరికేలా చూస్తామన్నారు. ఇప్పుడేమో కంది పప్పు రాలేదని చెబుతున్నారు. మా లాంటి పేదలకు అవసరమైన కంది పప్పు సరఫరా అయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. బయట మార్కెట్‌లో అధికంగా రేట్లు ఉన్నాయి. – రేఖ, గుడిపాల

కందిపప్పు లేదంటున్నారు

రేషన్‌ దుకాణాల్లో బియ్యం, పంచాదార మాత్రమే ఇస్తున్నారు. కంది పప్పు అడిగితే ప్రభుత్వం నుంచి రాలేదని డీలర్‌ చెబుతున్నారు. బయటి మార్కెట్‌లో కిలో కంది పప్పు రూ.150 వరకు అమ్ముతున్నారు. అంత ధర పెట్టి కొనలేకపోతున్నాం. గతంలో కిలో రూ.67కే కందిపప్పు ఇచ్చేవారు. – విజయ( గుడిపాల)

Advertisement
 
Advertisement
Advertisement