● ప్రభుత్వ డబ్బుతోనే నీటిని పంపిణీ చేస్తున్న అధికారులు ● ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటున్న అధికార పార్టీ నేతలు ● స్థానిక సంస్థలకు ముందస్తుగా ప్రచారం చేసుకుంటున్న వైనం ● సొంత నిధులు పెట్టి నీటినందిస్తున్నట్టు కలరింగ్ ● ఆపై ఆధికారులతో కుమ్మకై ్క అధిక బిల్లులు దిగమింగేలా ప్లానింగ్ ● విస్తుపోతున్న జిల్లా ప్రజలు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు తీవ్ర రూపందాల్చాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణంగా తాగునీటికి తంటాలు పడాల్సివస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోటార్లు, పైప్‌లైన్ల మరమ్మతులకు నోచుకోనంటున్నాయి. అత్యవసర సమయాల్లో ఆదుకోవాల్సిన చేతిపంపులు సైతం మూలకు చేరుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో ట్యాంకర్లే దిక్కుగా మారాయి. అవికూడా అరకొర సరఫరా చేస్తుండడంతో నీటి కష్టాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
అబ్బా..నొక్కేద్దామనే!
తాగునీటి ఇబ్బందులను సైతం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వాడుకునే ‘ట్యాంకర్’ రాజకీయం జిల్లాలో జోరందుకుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా రూ.490 చెల్లించి నీటిని సరఫరా చేస్తుంటే, కొందరు టీడీపీ నాయకులు తామే సొంత నిధులు ఖర్చు పెడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల ముందే డబ్బులు చెల్లించి, నీటి సరఫరా చేసి.. ఆ తర్వాత అధికారులతో కుమ్మకై ్క ఆ బిల్లులు పాస్ చేయించుకోవడానికి పన్నాగం పనున్నతున్నారు. రెండు నెలల నీటి కష్టాలను క్యాష్ చేసుకుంటూ, ట్యాంకర్ల సరఫరా, పైప్‌లైన్లు, చేతిపంపుల మరమ్మతుల పేరిట లక్షల ప్రభుత్వ సొమ్మును నొక్కేయాలని చూస్తున్నారు. అధికారులు సైతం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కిమ్మనకుండా ఉండిపోతున్నారు.
క్షేత్ర స్థాయి కష్టాలు ఎక్కువ
కుప్పం నియోజకవర్గం, గుడుపల్లె మండలంలోని ఎ.గొల్లపల్లి, కె.గొల్లపల్లి, నల్లగంపల్లి, వెంకటపురం, అలుగుమానిపల్లి, శాంతిపురం మండలంలో కేటీపల్లె, మటం, పలమనేరులో జంగాలపల్లి, వి.కోటలో దిగువనడిపేపల్లి, పులిచెర్లలో బేరుపల్లి సహా పది గ్రామాల్లోనే నీటి సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో రోజుకు 14 ట్రిప్పుల చొప్పున 5 వేల లీటర్ల నీటిని తోలుతూ, ట్రిప్పుకు రూ.490 చెల్లిస్తున్నారు. మిగిలిన చోట్ల వ్యవసాయ బోర్లను అనుసంధానం చేసి నీరు ఇస్తున్నారు. అయితే అధికారిక లెక్కలకంటే అనధికారికంగా సమస్య ఉన్న గ్రామాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలోని 5,133 చేతిపంపుల్లో 3,880 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన వాటిని బాగు చేయలేదు. రాబోయే రోజుల్లో మరో 20 గ్రామాల్లో నీటి కొరత ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బోర్లు నిషేధం
జిల్లాలో భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. మితిమీరిన వాడకం, తక్కువ వర్షపాతం, గట్టిరాతి భూభాగంతో పాటు పాడైన పైప్‌లైన్లు, విద్యుత్ అంతరాయం ఈ దుస్థితికి కారమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పరిస్థితి తీవ్రంగా ఉన్న మూడు మండలాల్లోని 8 గ్రామాల్లో కొత్త బోర్లు వేయకుండా నిషేధం కూడా విధించారు.
పాతాళానికి భూగర్భ జలాలు
మండలం భూగర్భ జలాలు (మీటర్లలో)
గుడుపల్లె 50.89
వి.కోట 24.47
కుప్పం 22.09
రామకుప్పం 15
శాంతిపురం 14.24
గంగవరం 14.23
పెనుమూరు 14.23
చిత్తూరు అర్బన్ 14.63
బంగారుపాళ్యం 13.33
బైరెడ్డిపల్లె 12.19
రొంపిచెర్ల 12.19
ఐరాల 11.02
శాశ్వత పరిష్కారం ఎప్పుడు?
జిల్లాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.2,886 కోట్ల వ్యయంతో వైఎస్సార్ కడప జిల్లా గండికోట జలాశయం నుంచి చేపట్టిన రెండో దశ ప్రాజెక్టు పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికి మరో ఏడాది పైనే పడుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుంచి రూ.3,900 కోట్లతో పనులకు ప్రతిపాదించారు. ఈ రెండు గ్రిడ్ పనులు పూర్తయితేనే ఉమ్మడి జిల్లాలోని పుంగనూరు, కుప్పం, పలమనేరు, మదనపల్లె, చంద్రగిరి, చిత్తూరు, జీడీనెల్లూరు, పూతలపట్టు, నగరి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు శాశ్వతంగా తాగు, సాగునీరు అందుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.


