కుప్పంలో జనజాతర | - | Sakshi
Sakshi News home page

కుప్పంలో జనజాతర

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

పోటెత్తిన భక్తులు

నేడు అమ్మవారి విశ్వరూప దర్శనం

ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు

సమర్పించనున్న సీఎం చంద్రబాబు

కుప్పం: కుప్పంలో శ్రీతిరుపతి గంగమ్మ శిరస్సు ఊరే గింపు కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. అమ్మవారి శిరస్సు ఊరేగింపులో పాల్గొనేందుకు.. జంతు బలులిచ్చేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఎటుచూసినా జనమే కనిపించారు. కుప్పంతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి జంతు బలులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కాగా నేడు అమ్మవారి విశ్వరూప దర్శనానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరై..ప్రభుత్వం తరఫున ఆయన అమ్మవారికి సారె సమర్పించనున్నారు.

అమ్మవారి శిరస్సు ఊరేగింపు

కోరిన కోర్కెలు తీర్చే శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లి జాతరలో భాగంగా మంగళవారం అమ్మవారికి కళ్లు తెర తొలగించి శిరస్సును ఊరేగించే తంతు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం దేవాలయం నుంచి అమ్మవారి శిరస్సుకు తెరచుట్టి పెదబావి వద్దకు సంప్రదాయ బద్ధంగా తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కళ్లకు కట్టిన తెరను తొలగించారు. ఈ వేడుకను చూసేందుకు వేలాదిగా జనం రావడంతో కుప్పం కట్టపై జనప్రవాహం నెలకొంది. అక్కడి నుంచి అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ ఏడాది అమ్మవారికి వెండితో తయారు చేసిన నాగ పడగలను అలంకరించి ఊరేగింపు చేపట్టారు.

అమ్మా..గంగమ్మా!

అమ్మవారి శిరస్సు పట్టణ పురవీధుల్లో ఊరేగుతుండ గా, భక్తులు జంతు బలులతో పాటు సారె, పండ్లు, పూలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి కి నిమ్మకాయల మాల సమర్పించడం, తోమాలలు, ఒడిబాల కట్టడం వంటి సంప్రదాయ పద్ధతుల్లో మొ క్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బంధువులు, స్నేహితులతో కుప్పం పట్టణం కిక్కిరిసింది. అమ్మా... గంగమ్మ... కాపాడమ్మా..అంటూ ప్రణమిల్లి మొక్కులు తీర్చుకున్నారు.

విశ్వరూపదర్శనానికి ఏర్పాట్లు పూర్తి

అమ్మవారి జాతరలో భాగంగా చివరి అంకం బుధ వారం సాక్షాత్కారం కానుంది. అమ్మవారి శిరస్సు ఊరేగిపు ముగించుకుని ఆలయానికి చేరుకుంటుంది. ఆపై అమ్మవారు విశ్వరూప దర్శనాన్ని ప్రజలకు కల్పిస్తారు. ఈ తంతుతో జాతర ముగియనుంది. చివరి రోజు విశ్వరూప దర్శనానికి లక్షలాది మంది జనం తరలిరానున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. విశ్వరూప దర్శనం అనంతరం అమ్మవారిని బుధవారం రాత్రి 12 గంటలకు జలప్రవేశం చేయించడంతో జాతర ముగియనుంది.

ఘనంగా గంగమ్మ అమ్మవారి శిరస్సు ఊరేగింపు

Advertisement
 
Advertisement
Advertisement