పలమనేరు: కలెక్టర్ సంతకానే ఫోర్జరీ చేసి ఆర్డర్ కాపీని తయారు చేసిన ఘనుల విషయం పలమనేరులో మంగళవారం వెలుగుచూసింది. 22ఏలోని ఓ భూమిని డీనోటిఫైడ్ చేసినట్టు కేటుగాళ్లు ఫోర్జరీ ప్రొసీడింగ్స్ తయారుచేసి దాంతో అధికారులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. కాగా ఇలాంటి మోసాలు పలమనేరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో సాగుతున్నాయంటూ ‘సాక్షి’ ముందుగానే హెచ్చరించింది. ఆ మేరకు సోమవారం సాక్షి దినపత్రికలో రియల్ మాయగాళ్లు పేరిట కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఎలా బయటపడిందంటే..
తనకు ఆర్డర్ కాఫీ వచ్చినందున తన భూమిని రిజిస్ట్రర్ చేయాలని రైతు అధికారుల వద్దకెళ్లాడు. అయితే డీనోటిఫైడ్ కాపీ నం: ఆర్‌డీస్ ల్యాండ్ 8/4507099/2024ౖపై వెరిఫై చేసిన డిస్ట్రిక్ రిజిస్ట్రార్ క్రాస్ చెక్ కోసం కలెక్టర్‌కు పంపగా అక్కడ అది ఫోర్జరీ అని తేలింది. దీనిపై సీరియస్ అయిన కలెక్టర్ వెంటనే నిందితులపై పోలీసు కేసు నమోదు చేయాలని గంగవరం పోలీసులను ఆదేశించారు. ఫలితంగా వారు రెండ్రోజుల క్రితం గంగవరం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు
అందిన ఫిర్యాదు మేరకు నిందితులపై చీటింగ్, ఫోర్జరీ, ఫేక్ డాక్యుమెంట్స్, క్రిమినల్ కాన్ఫిరసీ, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయడం అనే సెక్షన్లతో కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో దీని వెనుకనున్న అసలు ముఠా వ్యవహారం బయటపడాల్సి ఉంది.
గంగవరం పోలీసులు కేసు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్
కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ప్రొసీడింగ్స్ కాపీ
ఏం జరిగిందంటే?
చైన్నె– బెంగళూరు హైవేకి ఆనుకుని గంగవరం రెవెన్యూ సర్వే నం.244/1లో 1.11 సెంట్లు, 244/2లో 0.83 సెంట్లు భూమి ఉంది. కోట్ల విలువైన ఈ భూమి అదే మండలం నల్లగుట్లపల్లికి చెందిన మంజునాథరెడ్డికి చెందినది. ఈ భూమి 2024లో 22ఏలో ఉంది. దీంతో ఈ భూమి క్రయవిక్రయాలకు నోచుకోదు. అయితే తన అవసరాల కోసం దీన్ని విక్రయించాలనుకున్న యజమాని 22ఏను డీనోటిఫై చేసేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. ఈ నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు తాము దీన్ని చేసిస్తామంటూ రైతు నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి సాక్ష్యాత్తు కలెక్టర్ షన్మోహన్ సంతంకంతోనే ఫోర్జరీ ఆర్డర్ కాపీని సిద్ధం చేశారు. దీన్ని తపాల్ ద్వారా గంగవరం తహసీల్దార్, చిత్తూరు డీఆర్, పలమనేరు ఆర్‌డీవో, ఓసీ కాపీ కలెక్టర్ కార్యాలయానికి పంపారు.


