చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో జరగడం లేదా?
కొందరు నన్నే టార్గెట్ చేస్తున్నారు!
దళితులను అణగదొక్కాలని చూస్తున్నారు
రెండు జిల్లాల్లో సంచలనం రేపిన
ఎమ్మెల్యే థామస్ మాటలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఇసుక, మట్టి, గ్రావెల్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. అక్కడి అక్రమార్కులు అధికార పార్టీ అధినాయకుల అండతోనే రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి ఆ పార్టీ ప్రభుత్వ విప్ వీఎం థామస్ చేసిన వ్యాఖ్యలే బలం చేకూర్చుతున్నాయి. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయం వేదికగా మంగళవారం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో థామస్ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
రాజకీయ ప్రకంపనలు
‘చంద్రగిరిలో కొండలు, గుట్టలు, చెరువులు యంత్రాలతో తవ్వేస్తున్నారు. టిప్పర్లతో మట్టిని, ఇసుకను తరలిస్తున్నారు. కానీ కొన్ని పత్రికలకు అవన్నీ కనిపించడం లేదా..?’ అంటూ ఎమ్మెల్యే థామస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘దళిత ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఒక ట్రాక్టర్ మట్టి కనిపించినా ఫొటోలు తీసి ప్రచారం చేసే మీడియా.. చంద్రగిరిలో నడుస్తున్న భారీ దోపిడీపై ఎందుకు నోరు మెదపడం లేదు..?’ ‘నగరిలో గుట్టలు..కట్టలు కరిగిపోతున్నా ఎందుకు నోరుమెదపడం లేదు’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘అగ్రకుల ఎమ్మెల్యే తప్పు చేస్తే అది తప్పుకాదా.. ?’ అంటూ ఆయన పరోక్షంగా దెప్పిపొవడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విప్ స్థాయి నేత చంద్రగిరి, నగరిలో మట్టి, ఇసుక అక్రమరవాణా జరుగుతోందని చెప్పడం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. థామస్ వ్యాఖ్యలను బట్టి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆరోపించారా అంటూ రెండు జిల్లాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
అధికారులు కదిలేనా?
చంద్రగిరి, నగరిలో సాగుతున్న మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలపై ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు, వార్తలను పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు అధికార పార్టీ ప్రభుత్వ విప్ స్వయంగా చేసిన ఆరోపణలపై స్పందిస్తారా..? లేదో వేచి చూడాల్సి ఉంది. ఇసుక, మట్టి తవ్వకాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణకు ఆదేశిస్తారా..? నేతల ఒత్తిళ్లకు తలొగ్గి మామూలే అన్నట్టుగా వదిలేస్తా..? అన్నది తేలాల్సి ఉంది.
‘దళిత ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తున్నారు. కొందరు కావాలనే వారినే టార్గెట్ చేస్తున్నారు. వారి కార్యకలాపాలపై నిఘా వేసి రచ్చకెక్కిస్తున్నారు. అంతెందుకు నా నియోజకవర్గంలోనే మట్టి తరలుతోందని విష ప్రచారం చేస్తున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నానని రాష్ట్రమంతా ఢంకా కొడుతున్నారు. ఒకసారి పక్క నియోజకవర్గాలను కూడా గమనించండి.. నగరి, చంద్రగిరి.. ఇతరత్రా నియోజవర్గాల్లో మట్టి, గ్రావెల్ తరలడం లేదా..? వాటినెందుకు ఎత్తి చూపడం లేదు..? అంటే దళితులు ఎది చేసినా రాద్ధాంతం చేస్తారా..?!’ అంటూ ప్రభుత్వ విప్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రకంపనలు సృష్టించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయనే చర్చ జరిగేలా చేశాయి.
నా నియోజకవర్గంలోనే
మట్టి తరలుతోందా?


