ఐరాల: మండలంలోని దిగువ కామినాయనపల్లెకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మనోహన్, పుష్ప దంపతుల ఇంటి ఆవర ణలో మే పుష్పం మంగళవారం వికసించింది. ఇది ఏప్రిల్లో మొగ్గ తొడిగి మేలో వికసిస్తుంది. ఈ మొక్కను చైన్నె నుంచి తెప్పించామని, ఆరేళ్లుగా మేలోనే పుష్పం వికసిస్తోందని మనోహన్ దంపతులు తెలిపారు.
అప్పుడే తెరిచేశారు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం, చెర్లోపల్లి వద్ద ఉన్న పళ్ల గుజ్జు ఫ్యాక్టరీకి రెవెన్యూ అధికారులు తాళం వేసినట్టే వేసి తెరిచేశారు. గతేడాది ఆ ఫ్యాక్టరీకి మామిడి రైతులు కాయలు తోలారు. ఆబకాయిలు సుమారు రూ.3 కోట్ల మేర ఉన్నాయి. ఏడాదిగా బిల్లుల చెల్లింపుపై ఫ్యాక్టరీ నిర్వాహకులు జాప్యం చేస్తూ వస్తున్నారు. ఉన్న గుజ్జునంత విక్రయించేశారు. అయినా బిల్లులు ఇవ్వకపోవడంతో నెల కిందట రైతులు దీక్ష చేపట్టారు. అధికారులు స్పందించి దీక్షను విరమించి.. బిల్లులు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేరక పోగా.. కలెక్టర్ ఆదేశాలతో ఫ్యాక్టరీని సీజ్ చేయడానికి పూనుకున్నారు. ఫ్యాక్టరీ ఉద్యోగులు రెండు రోజలు గడువు అడిగారు. అది కూడా తీరడంతో సోమవారం రెవెన్యూ అధికారులు ఫ్యాక్టరీకి తాళం వేశారు. అధికారులపై రాజకీయ ఒత్తిడి రావడంతో మళ్లీ ఫ్యాక్టరీని తెరిచారు. ఈ విషయం తెలుసుకున్న రైతులంతా మళ్లీ మండల రెవెన్యూ కార్యాలయాన్ని చుట్టిముట్టారు. బుధవారానికి రూ.50లక్షల వరకు బిల్లులు చెల్లిస్తామని ఫ్యాక్టరీ నిర్వాహకులు హామీ ఇచ్చారని, అందుకే తెరిచామని రెవెన్యూ అధికారులు చెప్పుకొచ్చారు.
చెస్ విజేతలు హేతశ్రీ, చైతన్య
చిత్తూరు కలెక్టరేట్ : ఆల్ చిత్తూరు చెస్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వేపమా ను వీధిలోని స్కూల్ ఆఫ్ చెస్ పాఠశాలలో అండర్–13 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ పోటీల్లో పలు ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలు హోరా హోరీగా సాగాయి.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
బాలికల విభాగంలో కుంచె హేతశ్రీ ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. అనంత నిత్య ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే బాలురు విభాగంలో చైతన్య ప్రథమ స్థానంలో, రామ్ గణేష్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. గెలుపొందిన నలుగురు విజేతలు ఈ నెల 23న మార్కాపురంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో చిత్తూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్.ఆర్.బీ ప్రసాద్ తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు స్కూల్ ఆఫ్ చెస్ చైర్మన్ దినేష్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.


