జూన్ నుంచి ప్రభుత్వ
కార్యాలయాలకు ప్రీపెయిడ్
బిల్లింగ్
ఆపై వాణిజ్య, గృహాలకు అమలు
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు
గతంలో స్మార్ట్ మీటర్లతో
ఇబ్బందులు తప్పవన్న చంద్రబాబు
ఇప్పుడు ఆయనే అమలు చేస్తున్న వైనం
పలమనేరు: ‘‘స్మార్ట్ మీటర్లతో ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అంధకారంలో ఉండాల్సిందే. రైతులకు ఉరితాడు వేసినట్టే. ట్రాన్స్‌కో వాళ్లు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులగొట్టండి. ఎవరికీ భయపడొద్దు. మీకు నేను అండగా ఉంటాను’’ అని చంద్రబాబునాయుడు 2024 ఎన్నికల ముందు కుప్పంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చెప్పారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు స్మార్ట్ మీటర్లు బిగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ముందుగా డబ్బు కట్టి రీచార్జ్ చేసుకుంటనే కరెంటు ఉంటుంది. లేకుంటే అంధకారంలో ఉండాల్సిందే. ఈ విధానాన్ని ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుచేస్తున్నారు. తర్వాత వాణిజ్య, వ్యాపార సంస్థలు, దుకాణాలు, ఇళ్లలో అమలుచేయనున్నారు. జూన్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ బిల్లింగ్ సిస్టంను తీసుకువస్తున్నారు. ఆపై వాణిజ్య, గృహాలకు స్మార్ట్ మీటర్లు అమర్చి ప్రీపెయిడ్ విద్యుత్ బిల్లింగ్ విధానాన్ని అమలు చేస్తామని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు చెబుతున్నారు. తర్వాత రైతుల వ్యవసాయ బోర్లు, బావుల మోటార్లకు స్మార్ట్ మీటర్లను బిగించి ముందుగా డబ్బు కట్టాకే పంటలకు సాగు నీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది.
ఇప్పుడు ప్రజలకు ఉరితాడు కాదా?
స్మార్ట్ మీటర్లతో ప్రజలు, రైతులకు ఉరితాడు తప్పదని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారని, అధికారంలోకి వచ్చే సరికి స్మార్ట్ మీటర్లతో ఎన్నో లాభాలుంటాయని చెబుతూ ప్రజలను ఏమారుస్తున్నారని ప్రతిపక్ష, వామపక్ష నాయకులు మండిపడుతున్నారు. చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తారని మరోసారి రుజువైందని ఆరోపిస్తున్నారు.
ముందుగా రీచార్జి చేసుకోవాలి
స్మార్ట్ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లో అమర్చుతున్నారు. ఇప్పటి వరకు మీటర్ రీడింగ్ చూసి బిల్లు ఇచ్చేవారు. ఇకపై ఎవరితోనూ పని ఉండదు. స్మార్ట్ ఫోనుకు రీచార్జ్ చేసుకుంటామో అదే విధంగా కరెంట్ బిల్లును ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. ఇదే పద్దతి అన్ని వర్గాలకు అమలు చేయనున్నారు. రైతులు మోటార్ హెచ్‌పీని బట్టి రీచార్జి చేసుకోవాలి. కట్టిన డబ్బులు అయిపోయిన వెంటనే ఆటోమేటిక్‌గా కరెంట్ సరఫరా ఆగిపోతుంది. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు మాత్రం విద్యుత్ వినియోగం, బిల్లింగ్‌లో పారద్శకత కోసమే ప్రీ పెయిడ్ విధానాన్ని అమలుచేస్తున్నట్టు చెప్పడం కొసమెరుపు.
మీటర్ రీడర్లకు మంగళం
ఉమ్మడి జిల్లాలో వేలాది మంది మీటర్ రీడర్లున్నారు. వీరు ప్రతినెలా ఇంటింటికీ వెళ్లి రీడింగ్‌ను తీసి బిల్లులు ఇస్తున్నారు. స్మార్ట్ మీటర్ల రాకతో వీరి ఉద్యోగాలు ఊడనున్నాయి. దీంతో వారు ఆందోళన బాట పట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే గ్రామ వలంటీర్లను ఇంటికి పంపించిన చంద్రబాబు సర్కార్ తాజాగా మీటర్ రీడర్లపై పడ్డారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం
మొత్తం ఇళ్ల సర్వీసులు 3,81,690
వ్యవసాయ సర్వీసులు
1.25 లక్షలు
కుటీర పరిశ్రమలకు చెందిన
మీటర్లు 4736
వాణిజ్య సర్వీసులు 4163
జిల్లాలోని జగనన్న లేఅవుట్లు
592
ఇది ప్రజలకు కుచ్చుటోపీ కాదా...
స్మార్ట్ మీటర్లతో ప్రజలకు ఇబ్బందు లు తప్పవు. భవిష్యత్తులో రైతులకు కష్టాలు తప్పనట్టే. రైతు వరి పంట వేసి నీటి తడులు ఇవ్వాల్సిన తరుణంలో చార్జీ కట్టలేదని కరెంట్ డిస్ కనెక్ట్ చేస్తే పంట ఏమి కావాలి. గతంలో స్మార్ట్ మీటర్లు వద్దన్న చంద్రబా బు ఇప్పుడు అధికారంలోకి రాగానే వాటిని ఎలా అమ లు చేస్తున్నారు. దీనిపై తాము ఏడాదిగా పోరాటం చేస్తున్నాం.
– గిరిధర్ గుప్త, సీపీఎం జిల్లా నాయకుడు, పలమనేరు
చంద్రబాబు ఊసరవెళ్లిని మించిపోయారు
ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను పగులగొట్టాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాటిని అమర్చుతున్నారు. కార్పొరేట్ కంపెనీకి మేలు కలిగిలా జనంపై భారం మోపుతున్నారు. ఆయన ఏమి చెబితే అదే కరెక్ట్ అన్న ట్టు మాట్లాడుతున్నారు. ఇదెక్కడి న్యాయం. దీన్ని జనం గమనించాలి. చంద్రబాబునాయుడు పూటకొక మాట మాట్లాడుతూ ఊరసవెల్లిని మించిపోయారు.
– వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే, పలమనేరు


