యాదమరి: మండలంలోని జంగాలపల్లి పంచాయతీ సీఎం కండ్రిగలో శనివారం రాత్రి ఇంటి పైకప్పు కూలి వృద్ధురాలు మృతిచెందింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జంగాలపల్లి పంచాయతీ సీఎం కండ్రిగ గ్రామానికి చెందిన నరసింహులు భార్య జయమ్మ(82)కు కూతురు, కుమారుడు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు చేసింది. ఆమె ఒంటరిగా దాదాపు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇంటిలోనే ఉంటోంది. ప్రస్తుతం ఆ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. శనివారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేసి నిద్రకు ఉపక్రమించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటి పైకప్పు కూలింది. తీవ్రంగా గాయపడిన జయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద శబ్దానికి హుఠాహుటిన వచ్చిన ఆమె మనవడు స్థానికుల సహాయంతో శిథిలాలను తొలగించి జయమ్మ మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచా రం అందుకున్న తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు నమోదు చేసు కుని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. జయమ్మ మృతదేహానికి పోస్టుమార్టం విషయమై అధికారులు, ఆమె బంధువుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు సమాచారం.
మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నాం
కాణిపాకం: రాష్ట్రంలోని మహిళల భద్రతే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తోందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆమె ఆదివారం కుటుంబ సమేతంగా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మురళీమోహన్ మంత్రికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాణిపాకంలో టీటీడీ ఆధ్వర్యంలో రూ.25 కోట్లతో కల్యాణ మండపాలు, రూ.15 కోట్లతో వంద గదుల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలి పారు. ఆలయ పరిసరాల్లో సుమారు 190 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. వాటిని ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేసి అనుమానాస్పద వ్యక్తులను వెంటనే గుర్తించేలా నిఘా వ్యవస్థను తీసుకువస్తున్నట్టు తెలిపారు. అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీ వెంకటరమణ, సీఐ శ్రీధర్‌నాయుడు, ఈవో పెంచలకిషోర్, చైర్మన్ మణినాయుడు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వి.కోట: మండలంలోని పలమనేరు– వి.కోట జాతీయ రహదారిలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొంది. దీంతో వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఎగువపల్లికి చెందిన నారాయణప్ప(58) ద్విచక్ర వాహనంలో వి.కోట నుంచి స్వగ్రామా ని కి బయలుదేరాడు. జాతీయ రహదారిలో కుమ్మరమడుగు వద్ద పలమనేరు నుంచి వి.కోట వైపు అతివేగంగా వెళుతున్న ఐచర్ వాహనం ఢీకంది. తీవ్ర గాయాలైన నారాయణప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు.
పంటలపై ఆగని ఏనుగు దాడులు
పలమనేరు: కుంకీ ఏనుగుల ద్వారా రైతుల పంట పొలాలపై ఏనుగులు రాకుండా చూస్తామన్న ప్రభుత్వం మాటలు నీటిమూటలుగానే మారా యి. ముసలిమడుగు వద్ద ఉన్న కుంకీ క్యాంపు సమీపంలోనే గ్రామానికి చెందిన పలువురు రైతుల పంటలపై శనివారం రాత్రి మదపుటేనుగు దాడి చేసింది. వరి, మామిడి, అరటి, బీర పంటలను తొక్కి నాశనం చేసింది. గ్రామస్తులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ట్రాకర్స్ సాయంతో ఏనుగును అడవిలోకి మళ్లించారు. పంట నష్టంపై అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు.
నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ప్రజలు నేరుగా తనను కలిసి సమస్యలు తెలియజేయవచ్చని వెల్లడించారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.


